న్యూఢిల్లీ : రక్షణ బడ్జెట్‌కు 2022 23 ఆర్థిక సంవత్సరానికి రూ. 5.25 లక్షల కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.4.78 లక్షల కోట్ల కంటే 9.82 శాతం పెంచి రూ. 46,970 కోట్లను కేటాయించారు. మంగళవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మూలధన వ్యయం కింద ప్రత్యేకంగా మొత్తం రూ. 1,52, 369 కోట్లు కేటాయించడమైంది. దీంతో కొత్త ఆయుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్, యుద్ధ నౌకలు, ఇతర మిలిటరీ అవసరాల కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. 202122 లో మూలధన వ్యయం కింద రూ.1,35,060 కోట్లు కేటాయించగా, ఇప్పుడు సవరించిన అంచనాతో మూలధన వ్యయం కేటాయింపు రూ. 1,38,850 కోట్లకు చేరుకుంది. ఇక వేతనాల చెల్లింపు , నిర్వహణ ఖర్చులు తదితర వ్యయాల కింద రూ. 2,33,000 కోట్లు వెచ్చించారు. ప్రత్యేకంగా పెన్షన్ల కింద రూ. 1,19,696 కోట్లు కేటాయించగా, రక్షణ మంత్రిత్వ శాఖకు రూ. 20,100 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులను అద్భుతమైన చొరవగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అభివర్ణించారు.
రక్షణ శాఖ ఆర్ అండ్ డి బడ్జెట్‌లో 25 శాతం ప్రత్యేకంగా అంకుర పరిశ్రమలకు , ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలన్న ప్రతిపాదనను అభినందించారు. అలాగే స్వదేశీ పరిశ్రమల నుంచి రక్షణ సామగ్రి, పరికరాల కొనుగోలుకు, సేకరణకు మూలధన వ్యయం నుంచి 68 శాతం కేటాయించడాన్ని స్వాగతించారు. స్థానికంగా కొనుగోళ్లకు ఈ 65 శాతం వెచ్చించ వలసి ఉంటుంది. ఇది స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తుందని రాజ్‌నాధ్‌సింగ్ పేర్కొన్నారు. రక్షణ పరికరాలు, ఇతర అవసరాల దిగుమతులను తగ్గించడానికి, స్వయం సామర్ధంతో తయారైన వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 202122 లో 58 శాతం కేటాయించగా, ఇప్పుడు 68 శాతం కేటాయించడం స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహమిస్తుందని పేర్కొన్నారు. మిలిటరీ పరికరాలు, ఇతర సామగ్రి డిజైన్ చేయడానికి, అభివృద్ధి పర్చడానికి ఎస్‌పివి (స్పెషల్ పర్పస్ వెహికల్ ) ద్వారా ప్రైవేట్ పరిశ్రమను ప్రోత్సహించడమౌతుందని చెప్పారు. అలాగే భారీ ఎత్తున పరీక్షలు, ధ్రువీకరణ తదితర అవసరాలు తీరడానికి వీలుగా స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయడమౌతుందని చెప్పారు.