Sunday, December 22, 2024

సికింద్రాబాద్ వ్యాపారి ఇంట్లో ఐదున్నర కోట్ల సొత్తు చోరీ..

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ వ్యాపారి ఇంట్లో ఐదున్నర కోట్ల సొత్తు చోరీ
ముంబైలో నేపాలీ కుటుంబం పట్టివేత
మన తెలంగాణ/హైదరాబాద్: తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ రూ.5 కోట్లకు పైగా సొత్తుతో ఉడాయించిన నేపాలి దొంగలు పోలీసులకు చిక్కారు. సికింద్రాబాద్ సింధీ కాలనీలో ఓ వ్యాపారి ఇంట్లో భారీగా నగదుతో పాటు బంగారం, వెండి దొంగతనం జరిగింది. ఇంట్లో పనిచేసే నేపాలీ కుటుంబం ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలో వారిని అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని, నిందితులను జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… సికింద్రాబాద్ సింధీ కాలనీలో వ్యాపారి రాహుల్ గోయల్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఈ ఇంటికి వాచ్ మెన్ గా నేపాల్ కు చెందిన కమల్ పని చేస్తున్నాడు. కుటంబంతో కలిసి ఇక్కడే వుంటున్న వాచ్ మెన్ వ్యాపారి ఇంట్లో భారీగా నగదు, బంగారం వుండటం చూసాడు. దీంతో ఆ సొత్తుపై కన్నేసిన అతడు అదును కోసం ఎదురు చూశాడు గత ఆదివారం రాహుల్ గోయల్ కుటుంబం మొత్తం నగర శివారులోని ఫాంహౌజ్‌కు వెళ్ళింది. ఇదే దొంగతనానికి సరైన సమయంగా భావించిన వాచ్ మెన్ కమల్ తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు.

ఇంట్లోని రూ.49లక్షల నగదుతో పాటు 10కిలోల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులతో మూటగట్టి కుటుంబంతో సహా రాత్రికి రాత్రే ఉడాయించాడు. రాహుల్ కుటుంబం ఇంటికి తిరిగివచ్చేసరికి తాళం పగలగొట్టి వుంది. ఇంట్లోకి వెళ్లిచూడగా నగదుతో పాటు బంగారం, వెండి కనిపించలేదు. కాపలాగా వుండే వాచ్ మెన్ కమల్‌తో పాటు భార్యా పిల్లలు కూడా కనిపించలేదు. దీంతో ఈ దొంగతనం వాచ్ మెన్ చేసివుంటాడని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాంగోపాల్ పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరాలు, నిందితుడి సెల్ ఫోన్ సిగ్నల్, ఇతర సాంకేతిక ఆధారాలతో వాచ్‌మెన్ కమల్ చోరీ సొత్తుతో ముంబై వెళ్లినట్లు గుర్తించారు. ప్రత్యేక పోలీస్ బృందం ముంబైకి వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో మధుర బస్ స్టేషన్ లో కమల్ భార్య, ఇద్దరు పిల్లలు, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూడగానే కమల్ పరారవగా అతడి కోసం గాలిస్తున్నారు. దాదాపు రూ.5.5 కోట్ల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News