బ్యాంక్ దివాలా తీస్తే 90 రోజుల్లో అందుతాయ్
డిఐసిజిసి చట్టం అమలు కింద రూ.1300 కోట్లు విడుదల
2021 డిసెంబర్ 31న రెండో దశ నిధులు : ప్రధాని మోడీ
ముంబై : ప్రభుత్వం తీసుకొచ్చిన డిపాజిట్ సంస్కరణలతో బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో నమ్మకం స్థిరంగా ఉండనుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ కార్పొరేషన్(సవరణ) బిల్లు2021తో బ్యాంకు ఖాతాదారులకు భరోసా లభిస్తుంది. ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే 90 రోజుల్లోగా ఖాతాదారులు రూ.5 లక్షల వరకు పొందుతారు. ఇది డిపాజిటర్లలో నమ్మకాన్ని పెంచుతుందని మోడీ అన్నారు. ఈ చట్టం అమలుతో గత కొద్ది రోజులుగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న బ్యాంకులకు చెందిన లక్షకు పైగా డిపాజిటర్లకు దాదాపు రూ.1300 కోట్లు విడుదల చేశామని మోడీ తెలిపారు. మరో 3 లక్షల మంది ఖాతాదారులు కూడా త్వరలోనే ఆర్బిఐ మారటోరియం కింద డిపాజిట్లను పొందుతారని అన్నారు. ఆర్బిఐ నిబంధనల కింద 16 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్ల నుంచి వచ్చిన క్లెయిమ్‌లను పరిశీలించి, తొలి దశగా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
రెండో దశ నిధులను 2021 డిసెంబర్ 31న విడుదల చేయనున్నారు. ‘డిపాజిటర్లు ఫస్ట్: గ్యారెంటీడ్ టైమ్ బౌండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ చెల్లింపు రూ. 5 లక్షల వరకు’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, బ్యాంకుల్లో డబ్బు నిలిచిపోయిన డిపాజిటర్లకు మొత్తం రూ.1300 కోట్లు చెల్లించామని అన్నాఐరు. ఈ కార్యక్రమంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) చట్టం కింద బ్యాంకులో డిపాజిట్లపై అందుబాటులో ఉన్న రూ.5 లక్షల హామీ గురించి మోడీ వివరించారు. కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ సహాయమంత్రి, ఆర్బిఐ గవర్నర్ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఏ దేశమైనా సకాలంలో పరిష్కరించడం ద్వారా సమస్యలను మరింత తీవ్రతరం కాకుండా కాపాడగలదని అన్నారు. దేశంలో బ్యాంకు డిపాజిటర్లకు బీమా వ్యవస్థ 60వ దశకంలోనే తయారైంది. గతంలో బ్యాంకులో జమ చేసిన మొత్తంలో రూ.50 వేల వరకు మాత్రమే గ్యారెంటీ ఉండగా, ఆ తర్వాత లక్ష రూపాయలకు పెంచారు.
అంటే బ్యాంకు మునిగిపోతే డిపాజిటర్లకు లక్ష రూపాయలే వచ్చేలా నిబంధన ఉండేది. ఈ డబ్బు ఎంత కాలంలో అందుతుందనేది లేదు. పేదల ఆందోళనను అర్థం చేసుకుని ఈ మొత్తాన్ని మళ్లీ రూ.5 లక్షలకు పెంచామని, అంతాకాకుండా బ్యాంకు మునిగిపోయిన 90 రోజుల్లోపు ఈ డబ్బు ఇవ్వాలనే నిబంధన తెచ్చామని మోడీ తెలిపారు. బ్యాంకు సంపన్నులకు, పెద్దవారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని సాధారణ ప్రజలు భావించేవారు. అయితే జన్ ధన్ యోజన, వీధి వ్యాపారుల రుణ పథకం ఈ అభిప్రాయాన్ని మార్చింది. జన్ ధన్ యోజన కింద తెరిచిన కోట్లాది బ్యాంకు ఖాతాల్లో సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఈ బ్యాంకు ఖాతాలు మహిళల ఆర్థిక సాధికారతపై ప్రభావం చూపాయి. మరోవైపు పెద్ద బ్యాంకుల్లో విలీనం, సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షించడ వల్ల సాధారణ డిపాజిటర్లకు వాటిపై విశ్వాసం కూడా పెరుగుతుందని తెలిపారు.
బడ్జెట్-2021లో ఈ చట్టం ఆమోదం
ఆగస్టులో తీసుకొచ్చిన ఈ డిఐసిజిసి చట్టంలో మార్పును చేయడం వల్ల ఒకవేళ బ్యాంక్‌లు విఫలమైతే డిపాజిటర్లు రూ.5 లక్షల వరకు నిర్ణీత సమయంలో తిరిగి పొందుతారు. డిఐసిజిసి కవర్ ప్రకారం డిపాజిటర్ తన డబ్బును నిర్ణీత సమయంలో సులభంగా పొందుతారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన రూ.5 లక్షల మొత్తానికి ఇకపై డిఐసిజిసి చట్టం కింద భద్రత కల్పిస్తామని బడ్జెట్లో ప్రకటించారు.