Monday, January 20, 2025

శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెక్కును రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో సోమవారం దివంగత ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీశాఖ అధికారులు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును శ్రీనివాసరావు భార్య , పిల్లలకు అందజేశారు.

ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సిసిఎఫ్) భీమానాయక్ మాట్లాడుతూ శ్రీనివాసరావు హత్య బాధాకరం, అత్యంత దారుణం. వారి కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం అందజేశాం. వారి కుటుంబానికి ప్రకటించిన ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లల చదువు, ఇతర బెనిఫిట్స్ విషయంలో సహకరిస్తామని వెల్లడించారు. శ్రీనివాస్‌రావు కుటుంబానికి అండగా ఉంటామని తెలిపిన స్థానిక నాయకులు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డిఎఫ్‌ఓలు సిద్దార్థ్ విక్రమ్ సింగ్, రంజిత్‌నాయక్ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం మేయర్ నీరజ పాల్గొన్నారు.

ప్రభుత్వానికి ధన్యవాదాలు : అటవీశాఖ ఉద్యోగులు

వేగంగా స్పందించి ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెక్కును అందజేసి, కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని —- తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, —-తెలంగాణ జూనియర్ అటవీ అధికారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏ మాత్రం సహించబోమని, దోషులను కఠినంగా శిక్షిస్తామని, ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాసరావు కుటుంబం కోసం ప్రకటించిన మిగతా హామీలను కూడా సకాలంలో నెరవేర్చి కుటుంబానికి ఊరట కలిగించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్‌రావు భార్యకు డిప్యూటీ తహసీల్దార్ హోదా ఉద్యోగంతో పాటు, ఇంటి స్థలం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని వారు కోరారు. ప్రభుత్వ ఆదేశానుసారం, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి సూచనలతో విధుల్లో పాల్గొంటున్నాం. విధి నిర్వహణలో ఉన్న అటవీ ఉద్యోగుల రక్షణకు ముందుకు వచ్చి, క్షేత్ర స్థాయిలో సహకరిస్తున్న పోలీస్ శాఖకు, డిజిపికి కృతజ్ఞతలు.

.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News