పెట్టుబడుల పేరుతో వందల కోట్లు ఛీటింగ్ చేసిన కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డికెజెడ్ టెక్నాలజీస్ నిర్వాహకులు పరారీలో ఉండడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఛీటింగ్ కేసు బయటికి రావడంతో వేలాది మంది బాధితులు బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మాదాపూర్ లోని సమృద్ది వశ్యం భవనంలో ఇక్బాల్, రాహిల్ డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థను ఏర్పాటు చేశారు. తమ సంస్థ ద్వారా ఆహార ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు తదితరాలను ఆన్‌లైన్‌లో విక్రయిసామని ప్రచారం చేసుకున్నారు.
వస్తువులను విక్రయించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్, యాప్‌ను రూపొందించారు. అంతేకాకుండా తమ వద్ద పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి నెలా 8 నుంచి 10 శాతం వడ్డీ చెల్లిస్తామని చెప్పారు. దీంతో చాలా మంది తక్కువ మొత్తంలో పెట్టుబడిపెట్టారు. వీరికి వడ్డీ చెల్లించడంతో భారీ ఎత్తున డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఎక్కువ పెట్టుబడిపెడితే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో భారీ ఎత్తున డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఇలా దాదాపుగా 60వేల మంది బాధితుల నుంచి రూ.500కోట్లు వసూలు చేసిన నిందితులు తర్వాత వడ్డీ చెల్లించడం ఆపివేశారు. ఇదే సంస్థలో ముందుగా బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పండుగల ఆఫర్లు…
పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసిన నిందితులు ఎక్కువ పెట్టుబడి పెట్టిన వారికి వడ్డీ 12 నుంచి 13.5 శాతం వడ్డీ ఇస్తామని ప్రచారం చేశారు. వీరు తయారు చేసిన యాప్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసిన వారికి 10 నుంచి 15 శాతం ప్రత్యేక రిబేట్ ఉంటుందని నమ్మించారు. తమ సంస్థలో పెట్టుబడిపెట్టిన వారికి ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తామని చెప్పారు. ఇలాంటి మాటలు నమ్మిన దాదాపు 60 వేల మంది రూ.500 కోట్ల వరకు పెట్టుబడిగా పెట్టారు. చాలామంది బాధితులు తమ వద్ద ఉన్న డబ్బులతోపాటు, చిట్టీలు ఎత్తి, అప్పులు తెచ్చి పెట్టుబడిపెట్టారు. లక్ష రూపాయల నుంచి కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారు.
అప్పులు కట్టలేక…
అధిక వడ్డీకి ఆశపడి పెట్టుబడి పెట్టిన వారు నానా బాధలు పడుతున్నారు. దాచుకున్న సొమ్ముతో పాటు అప్పుగా తీసుకుని వచ్చి పెట్టుబడి పెట్టడంతో వాటిని నెల నెలా కట్టలేక కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమకు స్థాయికి మించి డబ్బులు తీసుకుని వచ్చి పెట్టుబడి పెట్టామని, వాటిని తీర్చే దారి కన్పించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకుని వచ్చి పెట్టుబడిపెట్టడంతో నెలకు లక్షలాది రూపాయలు కట్టాల్సి వస్తోంది, ఎక్కడి నుంచి తీసుకు వచ్చి కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీకి ఆశపడితే రోడ్డున పడ్డామని బాధితులు తెలిపారు.