Wednesday, January 22, 2025

రూ. 500లకే గ్యాస్… ఏటా ఆరు సిలిండర్లు

- Advertisement -
- Advertisement -

89లక్షల మందికిపైగా లబ్ధిదారులకు వర్తింపు
ఏటా ప్రభుత్వంపై రూ.2225 కోట్లు భారం
అమలుకోసం ప్రభుత్వం కసరత్తులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిరుపేద కుటుంబాల వారికి వంటగ్యాస్‌ను రూ.500కే సరఫరా చేయనున్నట్టు చేసిన వాగ్ధానం మేరకు అర్హతగల కుటుంబాలకు ఏటా ఆరు సిలిండర్లను అందజేసేందకు ఆర్ధిక పరమైన అంశాలపై రేవంత్‌రెడ్డి సర్కారు దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను ఎప్పుడు పడితే అప్పుడు పెంచుతూ పోతోంది. 2014లో రూ.414 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరలు ఈ పదేళ్ల కాలంలో అనూహ్యంగా పెరుగుతూ వచ్చాయి. రూ.1155 చేరిన వంటగ్యాస్ సిలిండర్ సామాన్యుడికి మోయలేని భారంగా మారటంతో ఎన్నికలకు ముందు పేదకుటుంబాలకు రూ.500లకే గ్యాస్‌సిలిండర్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ దిశగా రాయితీ సిలిండర్ పధకం అమలుకు చర్యలు చేపట్టింది. ఆర్ధికంగా ప్రభుత్వంపైన ఎంత భారం పడుతుందన్నది ఆర్ధికరంగ నిపుణుల ద్వారా అంచనాలు వేయించి ఇప్పటికే ఒక అంచనాకు రాగలిగింది.

రేషన్‌కార్డుతో రాయితీ సిలిండర్ పథకాన్ని ముడిపెట్టినందు వల్ల రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల కుటుంబాలను ఆధారంగా చేసుకుని ఆర్ధికంగా ఎన్ని నిధులు అవసరమవుతాయన్నదానిపై ప్రాధమికంగా ఒక అంచనాకు రాగలిగింది. సిలిండర్ ధర రూ.500 చొప్పున ఏటా ఆరు సిలిండర్ల సరఫరా ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ. 2225కోట్లు భారం పడుతుందని ఆర్ధిక రంగం నిపుణులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు గ్యాస్ కంపెనీలు ధరలు పెంచితే మరింత అదనపు భారం పడనుంది. ధరల పెంపుదల ప్రభావం లబ్దిదారులపైన పడకుండా , గ్యాస్ కంపెనీలు పెంచిన ధరలతో నిమిత్తం లేకుండా రాష్ట్రప్రభుత్వం స్థిరంగా రూ. 500లకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేయనుంది.
89లక్షల కుటుంబాలకు వర్తింపు :
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేయనున్న వంటగ్యాస్ సిలిండర్ రాయితీ పధకం 89లక్షల కుటుంబాలకు వర్తించనుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కోటి 17లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ ,దాని పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మొత్తం 39.96లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ పరిధిలో 16.05లక్షలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 12.30లక్షలు, మేడ్చెల్ మల్కాజిగిరి పరిధిలో 11.61లక్షల గ్యాస్ కనెక్షన్లు వున్నాయి. అత్యల్పంగా భూపాలపల్లి జిల్లా పరిధిలో 6.6లక్షల కనెక్షన్లు ఉన్నాయి.
రాయితీ సిలిండర్‌కు 28లక్షల కుటుంబాలు అనర్హత !
రాష్ట్రంలో రూ.500 రాయితీ సిలిండర్ పధకం నుంచి 28లక్షల కుటుంబాలు అనర్హత కింద చేరనున్నాయి. రాష్ట్రంలో మొత్తం కోటి 17లక్షల గ్యాస్ కనెక్షన్లలో రాయితీ సిలిండర్ పధకం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తించనుంది. రాష్ట్రంలో 89లక్షల కుటుంబాలకు మాత్రమే ప్రస్తుతం రేషన్ కార్డులు అమలులో ఉన్నాయి. ఇటీవల రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వాటిని అటుంచింతే , వంటగ్యాస్ రాయితీ సిలిండర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలనుంచి 91,49,838 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల కంటే సుమారు రెండున్నర లక్షల దరఖాస్తులు అధికంగా వచ్చిపడ్డాయి. వీటన్నింటినీ స్క్రూటిని చేస్తే ఎన్నింటికి రూ.500గ్యాస్ రాయితీ పథకంలో అర్హత పొందుతాయన్నది త్వరలోనే లెక్క తేలుతుందని అధికారులు వెల్లడించారు.
66శాతం కుటుంబాల్లో రెండు నెలలకు ఒక సిలిండర్ :
వంటగ్యాస్‌ను వినియోగిస్తున్న కుటుంబాల్లో 44 శాతం కుటుంబాలు నెలకు ఒక సిలిండర్ చొప్పున ఏటా 12సిలిండర్లను వినియోగిస్తున్నట్టు గ్యాస్‌కంపెనీ అసోసియేషన్ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారలు కుటుంబాల్లో అధికశాతం పేద కుటుంబాలే కావటంతో గ్యాస్ వినియోగం కూడా తక్కువగానే ఉంటోంది. ఈ కోవలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 66 శాతం కుటుంబాలు సగటున రెండు నెలలకు ఒక సిలిండర్‌ను వినియోగిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న వంటగ్యాస్ రాయితీ పథకంలో ఇటువంటి కుటుంబాలకే పెద్ద ఎత్తున ఊరట లభించనుంది. ఈ కుటుంబాల వారికి ప్రభుత్వం సిలిండర్ రూ.500లకే ఇచ్చే రాయితీ పథకంకింద మొత్తం ఆరు సిలిండర్లతో ఏడాదంతా వంటగ్యాస్ అవసరాలు తీరిపోనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News