నేటి నుంచి మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు
ముంబయి: కరోనా రెండో ఉధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంక్షల్ని ధిక్కరించినవారి నుంచి జరిమానాలు వసూలు చేయనున్నట్టు హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా ఉధృతిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే సమీక్ష నిర్వహించిన మరుసటి రోజే ఈ ఆదేశాలు రావడం గమనార్హం. శనివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫూ అమలులోకి రానున్నది. అందులో భాగంగా మరికొన్ని ఆంక్షల్ని ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రకాల సమావేశాలపైనా ఏప్రిల్ 15 వరకు నిషేధం విధించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం7 గంటల వరకు ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువమంది గుమి కూడటానికి వీల్లేదు. మాల్‌లు, గార్డెన్లు, బీచ్‌లు మూసివేయాలి. ఆంక్షల్ని ధిక్కరించినవారికి రూ.1000 జరిమానా విధిస్తారు. మాస్క్‌లు లేకుండా బయట తిరిగేవారు రూ.500 జరిమానా చెల్లించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ.1000 జరిమానా చెల్లించాలి. సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, రెస్టారెంట్లు నిర్దేశించిన సమయాల్లో మూసి వేయాలి. హోం డెలివరీ ఆహార ప్యాకెట్లకు అనుమతించారు.