గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ పోలీసులు ఇటీవల దేశ రాజధానిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో 700కిలోలకు పైగా కొకెయిన్ పట్టుకున్నారు. విచారణలో గుజరాత్‌లోని అంకలేశ్వర్ జిల్లాలో ఉన్న ఆవ్‌కార్ డ్రగ్స్ సంస్థ పేరును నిందితులు చెప్పినట్లు సమాచారం. దీంతో గుజరాత్ పోలీసులతో కలిసి ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా సంస్థపై దాడులు చేసి భారీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
518 కిలోల కొకెయిన్‌ను పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐదుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, పట్టుబడిన డ్రగ్స్ విలువ మార్కెట్ లో రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. తాజాగా పట్టుబడిన దానితోపాటు ఇటీవల కాలంలో 1,289 కిలోగ్రాముల కొకైన్, 40 కిలోగ్రాముల హైడ్రోపోనిక్ గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. దీని మొత్తం విలువ దాదాపు రూ.13,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.