మనతెలంగాణ/హైదరాబాద్: రుణయాప్‌ల కేసులో కుడోస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బిఎఫ్‌పి) కంపెనీ సొమ్ము రూ.72.32 కోట్లను బుధవారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. వివిధ బ్యాంకుల్లోని కుడోస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన రూ.72.32 కోట్లు తాత్కాలిక జప్తు చేసినట్లు ఇడి అధికారులు వెల్లడించారు. చైనా కంపెనీల నిధులతో అక్రమంగా సూక్ష్మరుణ వ్యాపారాలు నిర్వహించేందుకు సహకరించిన కుడోస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ సిఇవొ పవిత్ర ప్రదీప్ వాల్వేకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డిసెంబర్‌లో అరెస్ట్ చేసింది. ఆయనకు హైదరాబాద్ పిఎంఎల్‌ఎ ప్రత్యేక న్యాయస్థానం 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మొబైల్ యాప్‌ల ద్వారా వ్యక్తిగత సూక్ష్మరుణాలు ఇస్తున్న ఫిన్‌టెక్ కంపెనీల అక్రమ కార్యకలాపాలపై ఇడి సాగిస్తున్న దర్యాప్తులో భాగంగా కుడోస్ కార్యకలాపాలపై దృష్టి సారించడంతో అసలు విషయం వెలుగుచూసింది.
ఈ నేపథ్యంలో వినియోగదారులను గుర్తించి రుణ అర్హత కనిపెట్టడం దగ్గరి నుంచి రుణవాయిదాల వసూళ్ల వరకు పలు ఫిన్‌టెక్(డిజిటల్ రుణ భాగస్వాములు) కంపెనీలకు కుడోస్ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేస్తోందని ఇడి దర్యాప్తులో వెల్లడైంది. ప్రతీ ఫిన్‌టెక్ సంస్థ కోసం ప్రత్యేక పేమెంట్ గేట్‌వేతో పాటు మర్చంట్ ఐడీని రూపొందించడమే కాకుండా తన ఎన్‌బిఎఫ్‌సి లైసెన్స్‌నే కుడోస్ సమకూర్చింది. అనుమతులు పొందకుండానే ఫిన్‌టెక్ సంస్థలు సూక్ష్మ రుణ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాయి. వినియోగదారుల సెల్‌ఫోన్లలోకి, సామాజిక మాధ్యమాల్లోకి అక్రమంగా చొరబడి సేకరించిన సమాచారంతో రుణాలు చెల్లించని వారిపై వేధింపులకు పాల్పడటంతో పలువురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఫిన్‌టెక్ కంపెనీలు 95 శాతం రికవరీతో ఏడాదిలో భారీగా లబ్ధిపొందాయి. కుడోస్ కంపెనీకి రూ.10 కోట్ల నికర యాజమాన్య సొమ్ము ఉన్నప్పటికీ దాదాపు రూ.2,224 కోట్లకుపైగా సొమ్మును రుణాల రూపంలో సమీకరించింది. ఈ సొమ్మంతా చైనా అధీనంలోని 39 ఫిన్‌టెక్ కంపెనీలకు చెందినదని, మొత్తం వ్యాపారంలో ఫిన్‌టెక్ కంపెనీలు రూ.544 కోట్ల మేర లాభాలు పొందాయని ఇడి విచారణలో తేలింది. అదేవిధంగా వీటిలో కుడోస్ కంపెనీకి రూ.24 కోట్ల లబ్ధి చేకూరిందని ఇడి వివరించింది.