చెన్నై : స్థానిక ఫార్మసీ చిరుద్యోగి ముహమ్మది ఇద్రిస్ బ్యాంకు ఖాతాలోకి అమాంతం రూ 753 కోట్లు వచ్చిపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతా నుంచి శుక్రవారం ఇద్రిస్ తన స్నేహితుడికి రూ 2000 పంపించాడు. తరువాత తన అకౌంట్ బ్యాలెన్స్ లెక్కచూసుకోగా ఇందులో రూ 753 కోట్లు క్రెడిట్ అయినట్లు ఉంది. వేలల్లో ఉండే తన బ్యాంక్ ఖాతా మొత్తం ఇప్పుడు ఇన్ని కోట్లరూపాయలకు చేరడంతో ఇద్రిస్ కంగుతిన్నాడు.
లేనిపోని తలనొప్పి ఎందుకుని సదరు బ్యాంకు శాఖకు వెళ్లి విషయం తెలియచేయగా వారు వెంటనే ఈ వ్యక్తి బ్యాంక్ ఖాతాను ముందు ఫ్రీజ్ చేశారు. ఈ మొత్తం ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చిందనేది ఆరాతీస్తున్నారు. తమిళనాడులో ఇటువంటి ఘటన జరగడం ఇది మూడోది. ఇంతకు ముందు ఓ క్యాబ్ డ్రైవర్ రాజ్‌కుమార్‌కుచెందిన ఖాతాలో ఏకంగా రూ 9వేల కోట్లు వచ్చిపడ్డాయి. దీనికి ముందు తంజావూర్‌కు చెందిన గణేశన్ ఖాతాలోకి రూ 756 కోట్లు వచ్చి వాలి ఆయనను కొంతకాలమైనా కోటీశ్వరుడిగా నిలిపాయి.