సిద్దిపేట: జిల్లాలో వానాకాలం సీజన్ కు సంబంధించి 95 వేల 913 మంది రైతుల నుండి రూ.760.55 కోట్లు విలువైన 3 లక్షల 88వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. జిల్లాలో 2021-22 వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులు 3 లక్షల 17 వేల 161 ఎకరాలలో వరి పంట సాగు చేశారని అన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఐకేపీ, పాక్స్, ఎఎంసి, మెప్మా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 412 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 225 ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 52,221 మంది రైతుల నుంచి 2 లక్షల 10 వేల 69 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 173 పాక్స్ కొనుగోలు కేంద్రాల ద్వారా 37,954 మంది రైతుల నుంచి ఒక లక్షా 53 వేల 738 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అదే విధంగా 9 ఎఎంసి కొనుగోలు కేంద్రాల ద్వారా 4,296 రైతుల నుంచి 18 వేల 9 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా,
5 మెప్మా కొనుగోలు కేంద్రాల ద్వారా 1,442 రైతుల నుంచి 6 వేల 234 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో సజావుగా ముగిసిందని మంత్రి తెలిపారు. జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు కృషి చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.
Rs.760 Crore paddy purchased in Siddipet: Harish Rao