హోటల్ లో తాము అడిగినవన్నీ తెచ్చిపెట్టినందుకు సర్వర్ కు అంతో ఇంతో టిప్పు రూపంలో ముట్టజెప్పడం మామూలే! కానీ అమెరికాలో ఓ కస్టమర్ ఏకంగా 10 వేల డాలర్లు (సుమారు రూ. 8 లక్షలు) టిప్పుగా ఇచ్చి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు!
మిషిగాన్ లో మాసన్ జార్ అనే రెస్టారెంట్ ఉంది. ఆ హోటల్ కు వచ్చిన మార్క్ అనే కస్టమర్ ఏం తిన్నాడో గానీ, 32 డాలర్లు (సుమారు రూ. 2వేలు) మాత్రమే బిల్లయింది. వెయిట్రెస్ ఆ బిల్లును తీసుకెళ్లి మార్క్ ముందు పెడితే, మార్క్ తడుముకోకుండా పర్సులోంచి పదివేల ముఫైరెండు డాలర్లు తీసి ఇచ్చాడట. ఆశ్చర్యపోయిన వెయిట్రెస్.. మేనేజర్ వద్దకు వెళ్లి విషయం చెప్పింది. బహుశా కస్టమర్ పొరబాటున అంత డబ్బు ఇచ్చాడేమోనని భావించిన మేనేజర్ మార్క్ వద్దకు వెళ్లి ‘మీరు బిల్లుకంటే ఎక్కువ డబ్బు ఇచ్చారు’ అంది. అందుకు మార్క్ ‘నేను కావాలనే పదివేల డాలర్లు టిప్ గా ఇచ్చాను’ అని చెప్పి, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
మార్క్ ఔదార్యానికి హోటల్ సిబ్బంది అంతా ఫిదా అయిపోయారు. అయితే మార్క్ అంత డబ్బు టిప్ గా ఇవ్వడానికి ఓ కారణం ఉంది. ఇటీవలే మరణించిన తన క్లోజ్ ఫ్రెండ్ జ్ఞాపకార్థం ఆ డబ్బును టిప్పుగా ఇచ్చాడట.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే… మార్క్ టిప్ ఇచ్చింది పేయిజ్ ములిక్ అనే వెయిట్రెస్ కే అయినా, ఆ డబ్బును ఆమె మిగిలిన అందరు వెయిట్రెస్ లతో కలసి పంచుకుందట! అదీ సంగతి.