రాష్ట్రంలోని 1,72,000 ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు సామాజిక భద్రత కరువు
కేంద్రం వెంటనే సిపిఎస్‌ను రద్దు చేయాలి
దీని రద్దు కోరుతూ నేటి నుంచి ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’ ప్రారంభం
33 జిల్లాల మీదుగా కొనసాగనున్న యాత్ర
భారీ సంఖ్యలో పాల్గొననున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు
మద్ధతు తెలిపిన అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు
సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
హైదరాబాద్: కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేలా, ఉద్యోగస్థులను మోసం చేస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా నేడు పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర ప్రారంభంకానుంది. ఈ రథయాత్రలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొననున్నారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సిపిఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్ పునరుద్ధరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల మీదుగా సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులను సామాజిక భద్రత కలిగించే పాత పెన్షన్ ఆవశ్యకతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ యాత్రను చేపట్టినట్టు సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధానం కేవలం కార్పొరేట్‌లకు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని, ఈ సిపిఎస్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టంగా మారిందని, ఇప్పటికే ఉద్యోగుల సొమ్ము దాదాపు రూ.8 వేల కోట్లు పిఎఫ్‌ఆర్‌డిఏ ద్వారా ఎన్‌ఎస్‌డిఎల్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులుగా మారి షేర్ మార్కెట్‌లోకి చేరాయన్నారు. సిపిఎస్‌ను రద్దు చేస్తే అటు ప్రభుత్వానికి, రాష్ట్రంలోని 172,000 ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు సామాజిక భద్రత చేకూరుతుందని స్థితప్రజ్ఞ పేర్కొన్నారు.
నేడు అలంపూర్ మొదలై…జూలై 31న యాదాద్రిలో ముగింపు
ఈ సంకల్ప రథయాత్ర జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో మొదలై రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా , రెవెన్యూ కేంద్రాల్లో జూలై 31 వరకు ఈ యాత్ర కొనసాగి యాదాద్రి నరసింహస్వామి క్షేత్రంలో ముగుస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని టిజిఓ, టిఎన్‌జిఓ , పీఆర్టీయూ , రెవెన్యూ ట్రెసా, జ్యుడీషరి, అగ్రికల్చర్, ఇరిగేషన్ ,వైద్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ , ఎస్‌టియూ,టిపియూఎస్ ఇతర ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘాలు,అన్ని డిపార్ట్‌మెంట్ సంఘాలు సిపిఎస్ ఉద్యోగులే కాకుండా ఓపిఎస్ పాత పెన్షన్‌లో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఈ యాత్రకు మద్దతు ఇచ్చాయని ఆయన తెలిపారు. రెండు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను అభద్రతాభావానికి గురి చేస్తున్న ఈ కాంట్రీ బ్యూటరి పెన్షన్స్ స్కీం అటు ప్రభుత్వానికి, ఇటు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను నష్టపరిచే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే దేశంలో ఆరు రాష్ట్రాల్లో ఈ విధానంపై సమీక్షలు జరిపి, కమిటీలు వేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించుకున్నాయన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి ఈడిగి నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.