Sunday, January 19, 2025

రూ.81,516 కోట్లు.. ఇదీ విద్యుత్ సంస్థల అప్పు

- Advertisement -
- Advertisement -

విద్యుత్ రంగం ఆందోళనకరం

16,538 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీకి రంగం సిద్ధం

దేశంలో విద్యుత్ సంస్కరణలు కాంగ్రెస్ హయాంలోనే
గతం కంటే మూడు రెట్లు పెరిగిన విద్యుత్ డిమాండ్

ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేసి నాణ్యమైన విద్యుత్ సరఫరా
ఇంధన శాఖ శ్వేత పత్రంపై ఎమ్మెల్యే ప్రశ్నలకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ అవసరాలను ఎంతో ముందు చూపుతో గణాంకాలు వేశామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న 5661 మెగావాట్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 16538 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ కి రంగం సిద్ధం చేసినట్లు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చకు సమాధానమిస్తూ 2004లో కేంద్రంలో అధికారంలో వున్న యుపిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే  క్రమంలో, జనాభా 58 :32 శాతం, 41.68 శాతం నిష్పత్తి ప్రకారం ఉన్నా కూడా, కీలకమైన విద్యుత్ వనరుల పంపకం తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 46.11శాతం ఆంధ్రప్రదేశ్‌కు, 53.89 శాతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించనట్లు చెప్పారు.

దేశంలో ప్రతి ఏటా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దాదాపు రెండు దశాబ్దాల క్రితమే విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ సంస్కరణల ఫలితంగానే దేశంలోని అనేక రాష్ట్రాలలో కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు దారులు పడ్డాయని, విద్యుత్ మార్కెట్ కోసం ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానించే ట్రాన్స్‌మిషన్ కారిడార్‌కు అవసరమైన ప్రణాళికలు కూడా అప్పుడే రూపుదిద్దుకున్నాయన్నారు. అప్పుడు చేపట్టిన సంస్కరణల ఫలితంగానే, అప్పటి మా ప్రభుత్వం ముందు చూపుతో 2014కు ముందు తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం అనేక ప్రాజెక్టులు ప్రారంభించిందని, తరువాత 10 ఏళ్లలో పెరిగే డిమాండును సైతం తట్టుకునే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇక్కడ పెరిగిందన్నారు.

రాష్ట్రం ఏర్పడే నాటికి దాదాపు 5661 మెగావాట్లుగా వున్న డిమాండ్ తరువాత 3 రెట్లు పెరిగి 2023 నాటికి దాదాపు 15,500 మెగావాట్లకు చేరిందని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి కొత్తగూడెం థర్మల్ పవర్ కేంద్రం 800 మెగావాట్లు, కాకతీయ ధర్మల్ పవర్ (రెండవ దశ) 600 మెగావాట్లు, సింగరేణి – జైపూర్ విద్యుత్ కేంద్రం 1200 మెగావాట్లు, లోయర్ జూరాల హైడల్ కేంద్రం 240 మెగావాట్లు, పులిచింతల హైడల్ కేంద్రం 120 మెగావాట్లు పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి పనుల పురోగతిలో వున్న కేంద్రాలు- 2960 మెగావాట్లు , రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఆంధ్ర నుండి అదనంగా 1800 మెగావాట్లు, రామగుండంలో నిర్మించవలసిన ధర్మల్ కేంద్రం 4000 మెగావాట్లు, రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మొత్తం 5800 మెగావాట్లు మొత్తంగా తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం అప్పటి మా ప్రభుత్వాలు విద్యుత్ కేంద్రాల కెపాసిటీ 16538 మెగావాట్లు సిద్దం చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో నమోదైన విద్యుత్ డిమాండ్ 15,500 మెగావాట్ల నుండి భవిష్యత్తులో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి పెంపుకు చర్యలు చేపట్టవలసిన గత ప్రభుత్వం, 8వేల మెగావాట్ల ప్రైవేటు సోలార్‌తో కలిపి కేవలం 12వేల మెగావాట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నదన్నారు.

రాష్ట్రం ఏర్పడేనాటికి జెన్‌కో అప్పులు రూ.7,662 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ. 32,797 కోట్లకు పెరిగిందన్నారు.
గత ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని ప్రకటించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ 7 సంవత్సరాలు గడిచిన పూర్తి కాలేదని అధికారులు అనుసరించిన శాస్త్రీయమైన ఆర్థిక విధానాలే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ ముందు చూపుతో నిర్మాణం చేసిన పవర్ ప్రాజెక్టులతో వచ్చిన కరెంటు సరిపోవడంతో గత ప్రభుత్వం హయంలో రైతులు రోడ్లపైకి రాలేదన్న సత్యాన్ని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి గ్రహించాలని సూచించారు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం, చతీష్‌గడ్ నుంచి కొనుగోలు చేసిన కరెంటు ఒప్పందం పైన మీరు కోరుకున్నట్టుగానే జ్యూడిషియల్ విచారణ కచ్చితంగా చేయిస్తామన్నారు. విద్యుత్ శాఖలో ఆస్తులు పెంచితే డిస్కం నికర విలువ 2021- 22 నాటికి మైనస్ రూ. 30,876 కోట్లకు ఎట్లా వెళ్ళిందని ప్రశ్నించారు.

శ్వేత పత్రం విడుదల ద్వారా సభలో చెప్పినవన్నీ వాస్తవాలు విద్యుత్ శాఖకు సంబంధించి అన్ని విషయాలను ఎక్స్‌రే తీసినట్టు చూపించామని, విద్యుత్తు గురించి ఇన్నాళ్లు గొప్పలు చెప్పుకున్న విపక్ష నేతల డొల్లతనాన్ని బయట పెట్టడానికి ఈ శ్వేత పత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేశామని చెప్పారు. గత ప్రభుత్వ చర్యలతో విద్యుత్ రంగంలో రూ. 81,516 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. కృష్ణా ,గోదావరి మంజీరా నుంచి నీళ్లను తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. ఆర్థికంగా కుంగతీసిన తెలంగాణ విద్యుత్ సంస్థలను లేవనెత్తి, మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేసి రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును అందిస్తామన్నారు. అనంతర అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News