Tuesday, September 17, 2024

రూ.1700 కోట్లతో మంచినీరు

- Advertisement -
- Advertisement -

ktr

 

పట్టణాలు, శివారు గ్రామాలలో మంచినీటికి కొరత లేకుండా ప్రత్యేక ప్రణాళికలు, పకడ్బందీ చర్యలు, పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతిని విజయవంతం చేశాం. ఒక్క రూపాయి అవినీతికీ అవకాశం లేకుండా త్వరలో టిఎస్ బిపాస్. దేశంలోనే అత్యున్యత జీవన ప్రమాణాల నగరం హైదరాబాద్, ప్రధాన ఆర్థిక చోదక శక్తి
ఏటా రూ.10వేల కోట్ల కేటాయింపుతో, మొత్తం 50 వేల కోట్లతో విశ్వనగరంగా భాగ్యనగరం. నిధులు కేటాయించినందుకు సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు : శాసనసభలో మంత్రి కెటిఆర్

ఫార్మా కంపెనీ రానివ్వకుండా
ఓ ఎంపి రాజకీయం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మంచినీటి కోసం రూ. 1700 కోట్లతో మంచి నీటి ప్రణాళికలు రూపొందించామని, పట్టణాల నుంచి శివారు గ్రామాల వరకు నీటి ఎద్దడి లేకుండా పకడ్భందీగా చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ బడ్జెట్ పద్దులపై చర్చ సందర్బంగా అసెంబ్లీలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేశామని, పట్టణాలకు ధీటుగా పల్లెలను తీర్చిదిద్దుతామన్నారు. టిఎస్‌ఐపాస్ తరహాలోనే టిఎస్‌బి పాస్ ను కూడా త్వరలోనే తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. రూపాయి కూడా అవినీతి లేకుండా టిఎస్‌బిపాస్ ద్వారా పట్టణాల్లోని భవనాలకు అనుమతులిస్తామని స్పష్టం చేశారు. శాసనసభలో పురపాలక, పరిశ్రమలు, ఐటి పద్దుపై కెటిఆర్ వివరణ ఇచ్చారు. హైదరాబాద్ ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా ఉందని, మెర్సర్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో హైదరాబాద్ దేశంలోనే అత్యున్నత జీవన ప్రమాణాల నగరంగా నిలిచిందని గుర్తుచేశారు.

వేగంగా పెరుగుతూ అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరానికి మరిన్ని హంగులు తీర్చిదిద్దాలనే ఈ బడ్జెట్ లో ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిధుల కేటాయించినందుకు సిఎం తమ శాఖ, హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.రానున్న ఐదేళ్లలో హైదరాబాద్ కు ఏటా రూ.10వేల కోట్ల చొప్పున రూ.50వేల కోట్లతో విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సీఎం సిఎం సంకల్పంగా పెట్టుకున్నారన్నారు. హైదరాబాద్ మెట్రోలో రోజుకి 4 లక్షల నుంచి 4.50లక్షల వరకు ప్రజలు ప్రయాణిస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో మెట్రో రెండో దశ చేపట్టి మరింత విస్తరిస్తామన్నారు. ఐటి కారిడార్‌లో ఎలివేటెడ్ ట్రామ్ తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.

ప్రతి వార్డులో స్థానిక కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తామన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చిందని.. దీని ద్వారా ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ చట్టంతో జవాబుదారీతనం ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా అక్రమాలకుపాల్పడిన కౌన్సిలర్లను తొలగించాల్సి వస్తే ఆ ప్రక్రియను తెరాస నుంచే ప్రారంభిస్తామని గతంలోనే చెప్పిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో గ్రీన్,పింక్,బ్లూ,వైట్ రెవిల్యుషన్ సాధిస్తామని, ఇందుకు అందరూ తమవంతు కృషి చేయాలని కోరారు. అలాగే ఐటి రంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నామని, రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ఐటి సంస్థలను ఏర్పాటు చేయనున్నామన్నారు. హైదరాబాద్ నగరంలోనూ పశ్చిమ భాగంలో ఐటి అభివృద్ధి చెందుతోందని, అనతికాలంలో తూర్పుభాగంలో ఉప్పల్, ఘట్‌కేసర్ తదితర ప్రాంతాలలో ఐటి కంపెనీలు రానున్నాయన్నారు.

ఇటీవల కాలంలో 18 సంస్థలతో ఒప్పందం జరిగిందన్నారు. ఐటి రంగంతో పాటు ఫార్మా రంగానికి పెద్దపీట వేశామని, ప్రపంచంలోని అన్ని దేశాలు గర్వించేలా ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటికే ప్రపంచం వ్యాప్తంగా వ్యాక్సిన్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రంలో 1.3 శాతం ఉత్పత్తి జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఓ బడా ఫార్మా కంపెనీ రాకుండా రాష్ట్రానికి చెందిన ఓ ఎంపి అడ్డుపడుతుందటం విచారకరమన్నారు. ఏమాత్రం కాలుష్యం లేకుండా ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలన్న సిఎం కెసిఆర్ కలలను సాకారం చేసేందుకు అన్ని విధాల శ్రమిస్తామన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రీయల్ కంపెనీలు ఏర్పాటు చేస్తామని గతంలో మోసం చేసిన వారి నుంచి 1284 ఎకరాల భూమిని వెనక్కు తీసుకున్నామని, ఎవరైనా ఇండిస్ట్రీయల్ కంపనీల వారు ముందుకు వస్తే వారికి అనతికాలంలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

దేశ వ్యాప్తంగా దళితులు, గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్రానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 531 మంది దళిత, గిరిజన లబ్దిదారులకు రూ. 1081 కోట్ల రుణ సదుపాయం కల్పించామన్నారు. అలాగే జాతి సంపదైన మినరల్స్, మైనింగ్,ఇసుకకు సంబంధించి నూతన పాలసీ తీసుకురానున్నామన్నారు. 2004 నుంచి 2014 వరకు ఇసుకపై కేవలం రూ. 39 కోట్లు ఆదాయం రాగా, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రూ. 3వేల కోట్లకు చేరుకుందన్నారు. రాష్ట్రంలో మూసివేతకు గురైన బిల్ట్, నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీలను పునః ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని వివరించారు.

అదేవిధంగా రాష్ట్రంలో చేనేత, జౌలు, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో పట్టణ జనాభా 44 శాతం ఉందని, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు.కొత్త పురపాలక చట్టంలో జవాబుదారీ తనాన్ని పెంచామని, నూతన మున్సిపల్ చట్ట్టంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతాయన్నారు.

వచ్చే ఐదేళ్లలో రూ. 50వేల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి ఏంటో చూపిస్తామని, రూ.800 ఎనిమిది వందల కోట్లతో 38 పట్టణాలను ఆగిన మిషన్ భగీరథ పనులను పూర్తి చేస్తామన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో వార్డుల సంఖ్య పెంచే అంశాన్ని పరిశీలిస్తామని, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వివరించారు.ముఖ్యంగా
గ్రేటర్ సిటీ బడ్జెట్లో మూడోవంతు బడ్జెట్ శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం ఉపయోగించనున్నామని, ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా సభలో ప్రత్యేక చర్చ నిర్వహించి అనుమానాలు తీరుస్తామని తేల్చిచెప్పారు.

Rs. Drinking water plans with 1700 crores
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News