హైదరాబాద్: కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లొంగలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మూడు నెలలుగా బహుజన నాయకులపై దాడులు జరుగుతున్నాయని, అన్ని కులాలను ఆదుకునేది మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరేనని, ఎంఎల్‌సి కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కెసిఆర్ టార్గెట్‌గానే ఇవన్నీ జరుగుతున్నాయని, బ్యాంక్‌లకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారి పోయినవారిని ఏం చేయలేదని, అధికారంలో ఉన్నామని భయబ్రాంతులకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటామంటే కుదురదని హెచ్చరించారు. అసమానతలు, అణిచివేత ఉన్నందునే నక్సల్ బరి, తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందని తెలిపారు. ఈ గడ్డపై రాబోయే రోజుల్లో బహుజన ఉద్యమం కూడా పుట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అయోధ్యకు పోయినంత మాత్రాన బిజెపిలో చేరుతానా? అని ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.