లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ తన అలవాటు ప్రకారం అడ్డదారులు తొక్కుతున్నారని బిఆర్‌ఎస్ సీనియర్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే తమ పార్టీ నేత కెటిఆర్‌పై ఫేక్ అట్రాసిటీ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. దళిత-గిరిజన వర్గాల పక్షాన పోరాడుతున్న కెటిఆర్‌పై ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటీ కేసు ఎలా బుక్ చేయాలా… లేదా ఎస్‌సి, ఎస్‌టిలను నట్టేట ముంచిన రేవంత్ రెడ్డిపైనే అట్రాసిటీ కేసు చేయాలా..? అని ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు సీరియస్‌గా ఆలోచించాలని అన్నారు. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీని ప్రశ్నిస్తే కేసులు పెడతారా..? అని నిలదీశారు. లీకేజీ మాఫియాకు, కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను ప్రజలకు చెప్పడం నేరమా..? అని అడిగారు. కెటిఆర్ దళితులను ఏమన్నారు.. ఎక్కడ ఎవరిని దూషించారని అట్రాసిటీ కేసు పెట్టారు..? అని నిలదీశారు. ఆయనకు నిందితుల కులం తెలిసే అవకాశముందా..? అని అడిగారు.
పదవ తరగతి విద్యార్థుల్లో ఎస్‌సి, ఎస్‌టిలు లేరా.. వారికి జరిగిన అన్యాయంపై కెటిఆర్, క్రిషాంక్ మాట్లాడకూడదా..? అని ప్రశ్నించారు. 80 మంది గురుకుల విద్యార్థుల ప్రాణాలు తీసిన రేవంత్ ప్రభుత్వంపైనా, ఎస్‌సి సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించినందుకు, యాదాద్రిలో ఉప ముఖ్యమంత్రిని అవమానించినందుకు, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని గేట్లు మూసి బంధించినందుకు, అసెంబ్లీ స్పీకర్‌ను దళితుడని అవమానించినందుకు సిఎం రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని అన్నారు. చేవెళ్ల, ఇంద్రవెల్లిలో దళితులను మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్‌పై కేసు పెట్టాలని పేర్కొన్నారు. లగచర్లలో గిరిజన భూములను కబ్జా చేసిన తిరుపతి రెడ్డిపైనా, గ్రూప్ 1, 2లో వర్గీకరణ హామీ ఇచ్చి మోసం చేసిన రేవంత్‌పైనా అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం కూడా చేతకాలేదని ఆరోపించారు.
పోలీసులు, అధికారులు ఉండగా నిందితుడు పరీక్ష కేంద్రంలోకి ఎలా వెళ్లారని, జిరాక్స్ సెంటర్లు ఎలా తెరిచాయని అడిగారు. ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఇంటలిజెన్స్ ఏం చేసింది..? అని నిలదీశారు.కెటిఆర్, క్రిశాంక్, దిలీప్ కొణతంపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.