మన తెలంగాణ/కొల్లాపూర్ రూరల్: రాష్ట్రంలో బిఎస్పి అధికారంలోకి వస్తే భూమిలేని నిరుపేద దళిత కుటుంబానికి ఎకరా భూమి పంపిణీ చేస్తామని బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామానికి చెందిన పోడు రైతులతో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుండి మల్ల బస్పపురం శివారులో సర్వే నెంబర్ 36లో కుడికిళ్ల గ్రామానికి చెందిన 60 రైతు కుటుంబాలు 120 ఎకరాల భూమిని సాగు చేసుకున్నారన్నారు. రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని అప్పటి అచ్చంపేట ఎమ్మెల్యే పుట్టపాగ మహేందర్ నాథ్, అటవీ శాఖ మంత్రి, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌కు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.
2006-08లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోడు భూములకు రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు ఇచ్చారని, కానీ ఈ ప్రాంతంలోని రైతులకు మాత్రం పట్టాలు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యేలకు రైతుల సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. దళిత రైతుల సమస్యలు తీరాలంటే, దళితులకు అనుకూలమైన చట్టాలు రావాలంటే బిఎస్‌పి అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కుడికిళ్ల రైతుల పోరాటానికి బిఎస్‌పి సంపూర్ణ మద్ధతు, సంఘీభావం తెలుపుతుందని ఆయన అన్నారు.
RS Praveen Kumar meets Podu lands farmers in Kollapur