హైదరాబాద్ ః ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలను నివారించాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సిఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బహిరంగ లేఖలో ప్రస్తావిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. స్వరాష్ట్రంలో విద్యార్థులకు ఇంకా న్యాయం జరుగలేదని, గత ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు సరిపడా నిధులు కేటాయించకుండా, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. 2019 ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థ ల్లో చదువుతున్న విద్యార్థులు సీనియర్ల వేధింపులకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వీటన్నింటికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు.
గత పాలకుల తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని, తప్పులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని విద్యాసంస్థల్లో సైకాలజిస్టులు, కౌన్సిలర్లను నియమించి విద్యార్థుల మానసిక సమస్యల పరిష్కారం కొరకు 24/7 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలన్నారు. విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులను వెంటనే నియమించి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై నీరదారెడ్డి కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయం, వినోదం, యోగ, క్రీడల్లో రాణించేలా తెలంగాణ నూతన విద్యా విధానం రూపొందించాలి. విద్యార్థుల ప్రాణాలు కాపాడుటకు సిఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.