గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గురుకుల బాట కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారని మాజీ ఐపిఎస్ అధికారి, బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బిఆర్‌ఎస్ గురుకుల బాట కార్యక్రమంతో కాంగ్రెస్‌లో వణుకు మొదలైందని విమర్శించారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌లో తన హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఒక మాతృమూర్తిగా కొండా సురేఖ ఇలా మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. కొండా సురేఖ మత్తులో ఉండి మాట్లాడుతున్నారని విమర్శించారు. వరంగల్‌లో కొండా కుటుంబం చేసిన అఘాయిత్యాలతో ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయని ఆరోపించారు. నేర చరిత్ర పెట్టుకొని కొండా సురేఖ తమపై అభాండాలు వేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
కొండా సురేఖను తెలంగాణ ప్రజలు గతంలోనే తిరస్కరించారని చెప్పారు. మహిళలపై చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని అన్నారు. మంత్రి సీతక్క మూలాలు మరచి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్, బిఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, తాను అవినీతి చేసినట్లు ఆధారాలు ఉంటే సిబిఐ విచారణ చేయించాలని సవాల్ విసిరారు. గురుకులాలపై తాము కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. తన హయాంలో గురుకులాల్లో తప్పు చేశానని తేలితే జైలుకు వెళ్ళడానికి సిద్ధం.. ఉరికంభం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. తన రికార్డులు సంక్షేమ భవన్‌లో భద్రంగా ఉన్నాయని, అధికారం మీ చేతుల్లో ఉంది..ఎసిబి మీ చేతుల్లోనే ఉంది… ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ పాలనలో దాదాపు ఏడాదిగా విద్యాశాఖకు మంత్రి లేరని, సంక్షేమ శాఖకు మంత్రి లేదరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గురుకులాలు ప్రమాదపుటంచులో ఉన్నాయని మండిపడ్డారు. నాణ్యమైన భోజనం కోసం విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారని విమర్శించారు. తాను ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుని ఎంతో కష్టపడి చదవుకుని ఐపీఎస్ అధికారిని అయ్యానని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం పనిచేశానని తెలిపారు.గతంలో ఐపీఎస్ అధికారిగా తన సేవలను గుర్తించి తనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చాయని తెలిపారు. ఏడేండ్ల సర్వీస్ వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లో వచ్చానని చెప్పారు. తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని సురేఖ చెప్పారని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు.
పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు : కుట్ర ఎవరు చేస్తున్నారో బయటపెట్టాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా మారడం లేదని, చేతకాకపోతే విద్యాశాఖను బిఆర్‌ఎస్‌కు అప్పగించాలని అన్నారు. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని, రాజకీయాలు చేయవద్దని కోరారు. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి గురుకులాలు, పాఠశాలలకు వెళ్లి చూస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. 50 మంది విద్యార్థులు చనిపోతే విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి ఒక్కరిని కూడా పరామర్శించలేదని ఆక్షేపించారు. పిల్లలు పిట్టల్లా రాలుతుంటే విద్యా కమిషన్ ఎక్కడకు పోయిందని ఎద్దేవా చేశారు. గురుకులాల్లో సమస్యలపై అధ్యయనానికి వెళ్తున్నామని, ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా బిఆర్‌ఎస్‌వి 85220 -44336 నంబర్‌కు పంపాలని సూచించారు.
సిఎం రేవంత్ నయా దేశ్‌ముఖ్ : బాల్క సుమన్
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యస్థను విధ్వంసం చేస్తున్నదని మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ విమర్శించారు. ఇది రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి నయా దేశ్‌ముఖ్ అని దుయ్యబట్టారు. గురుకులాలు, కెజిబివిలు, ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో చదివేవాళ్లంతా పేద బడుగు, బలహీన వర్గాల పిల్లలు అని తెలిపారు. రేవంత్ రక్తంలో అణువణువునా ఆధిపత్య భావజాలం ఉందని, ఉద్దేశపూర్వకంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు విద్య దక్కకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే విద్యాశాఖ, సంక్షేమ శాఖలను తన దగ్గర పెట్టుకున్నారని విమర్శించారు.