Wednesday, January 22, 2025

ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్ హబ్‌గా సిద్దిపేట

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట పట్టణం అన్నీ రంగాల్లో ఒక బ్రాండ్ గా నిలిచింది. వ్యాపార, వాణిజ్య, విద్య, క్రీడా, సేవ, ఆరోగ్య, ఆహ్లాదకర, ఆధ్యాత్మికంగా పురోగతి చెందిందని అన్నీ రంగాలకు కేరాఫ్ సిద్దిపేట హబ్ గా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.

పట్టణంలోని 4వ వార్డులోని బ్యాంకు కాలనీలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా-UBI ఆధ్వర్యంలోని యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ-RSETI-Rural self Employment Training Institution నూతన భవన నిర్మాణ పనులకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యచంద్ర తేజతో కలసి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా కాళేశ్వరం ద్వారా గోదారి నీటి వసతి వచ్చిందని, త్వరలో రైల్వే సౌకర్యం రానున్నదని, త్వరలో ప్రముఖ కోకాకోలా కంపనీ కొండ పోచమ్మ సాగర్ వద్ద భారీ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నదని పేర్కొన్నారు.

అదేవిధంగా దక్షిణ భారత దేశంలో అతి పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ రైస్ మిల్లు వర్గల్ లో రానున్నదని పేర్కొన్నారు. బెజ్జంకి దాచారం వద్ద భారీ గ్రానైట్ ఫ్యాక్టరీ రానున్నదని, ఇప్పటికే డీఎక్స్ఎన్ వచ్చిందని.. ఇలా అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత కోసం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెట్విన్, న్యాక్, ఎల్అండ్ టీ, RSETI ద్వారా ఇచ్చే శిక్షణలు పొంది యువత స్వయం ఉపాధి, ఉద్యోగ కల్పన దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

శిక్షణ సర్టిఫికేట్ తోపాటు రుణాలు సైతం మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. శిక్షణ-ఉపాధి రెండు ఒకేచోట లభిస్తున్నాయని, మొదటి శిక్షణ పొందిన బ్యాచ్ ఇతరులకు ప్రేరణగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.
సిద్దిపేటలో వ్యవసాయ వృద్ధి పెరగటంతో పాటు వేగంగా పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.

సిద్దిపేటలో నెలకొల్పిన ఈ శిక్షణ కేంద్రాలకు యువత మొగ్గు చూపేలా సద్వినియోగం చేసుకునేలా.. స్థానిక ప్రజాప్రతినిధులపై గురుతరమైన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తూ.. నాయకుడంటే.. సమాజంలో నిజమైన ప్రజా సేవకుడిగా యువతకు మార్గానిర్దేశకుడిగా ఉండాలని నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.

ఈ బ్యాంకు కాలనీలో ఇప్పటికే ఎస్ బీఐ, ఏపీజీవీబీ రీజనల్ బ్యాంకులు వచ్చాయని, యూనియన్ బ్యాంకు రీజనల్ కార్యాలయం కూడా తేవాలని బ్యాంకర్లను మంత్రి హరీశ్ కోరారు. జిల్లాలో 140 బ్యాంకులు ఉన్నాయని, సిద్దిపేట పట్టణంలో 30 బ్యాంకులు ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా ప్రతియేటా 11 వేల కోట్ల రూపాయల బిజినెస్ బ్యాంకుల ద్వారా జరుగుతున్నదని వ్యాపార, వాణిజ్య కేంద్రంగా సిద్దిపేట నిలిచిందని చెప్పుకొచ్చారు.

కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ,మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ కొండం కవిత-సంపత్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యజిత్, సిద్ధిపేట యూనియన్ బ్యాంకు మేనేజర్ సత్యం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News