Thursday, January 23, 2025

ఆర్థిక విధానాలు x ఆర్‌ఎస్‌ఎస్

- Advertisement -
- Advertisement -

మానవ కేంద్రంగా, శ్రమతో కూడుకున్న, పర్యావరణ అనుకూలమైన, వికేంద్రీకరణ, ప్రయోజనాల సమాన పంపిణీపై ఒత్తిడి తెచ్చి, గ్రామ ఆర్థిక వ్యవస్థ, సూక్ష్మ, చిన్న తరహా, వ్యవసాయ రంగాన్ని పెంపొందించే భారతీయ ఆర్థిక నమూనాకు పెద్దపీట వేయాలని ఆర్‌ఎస్‌ఎస్ పిలుపివ్వడం ఒక విధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంగా పరిశీలకులు భావిస్తున్నారు. గుజరాత్‌లోని కర్ణావతిలో మూడు రోజుల పాటు జరిగిన సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభలలో ఆమోదించిన తీర్మానంలో ఈ పిలుపిచ్చారు. చిరకాలంగా ఆర్‌ఎస్‌ఎస్, పరివార్ సంస్థలు కోరుకొంటున్న ఆర్ధిక విధానాల పట్ల మరోసారి సాధికారికంగా విశ్వాసం వ్యక్తం చేసే ప్రయత్నం ఈ సందర్భంగా చేశారు.
ఒక విధంగా చూస్తే కేవలం మోడీ ప్రభుత్వం మాత్రమే కాకుండా 1991 నుండి నూతన ఆర్ధిక విధానాల పేరుతో కేంద్రంలోని ప్రభుత్వాలు వరుసగా అనుసరిస్తున్న ఆర్ధిక విధానాల పట్ల ఆర్‌ఎస్‌ఎస్ తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. పివి నరసింహారావు నుండి నరేంద్ర మోడీ వరకూ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలలో తీవ్రత, అమలు స్వభావంలో తేడాలు ఉన్నప్పటికీ మౌలికమైన సూత్రాలలో తేడాలు లేకపోవడం తెలిసిందే. కీలక రంగాలలో విదేశీ పెట్టుబడులను అనుమతించడం, లాభదాయకమైన – కీలకమైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వారికి అప్పచెప్పడం, చిన్న, సన్నకారు పరిశ్రమలకు విఘాతం కలిగించే విధానాలు అమలు పరచడం, గ్రామీణ- వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేస్తుండడం పట్ల మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది.
ప్రభుత్వాలు భారతీయ విలువలతో కూడిన ఆర్థిక నమూనాలను అనుసరించాలని, భారతదేశ సామాజిక నిర్మాణాన్ని, గ్రామీణ జీవితాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ ఎల్లప్పుడూ నమ్ముతుంది. దత్తోపంత్ తెంగడి ప్రముఖులు భారతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత అనుకూలమైన స్వదేశీ నమూనాను స్థిరంగా వ్యక్తీకరించారు. 1990ల ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థ సరళీకరణ తరువాత, ఆర్‌ఎస్‌ఎస్ అటువంటి నమూనా కోసం తీవ్రంగా కృషి చేస్తూ వస్తున్నది. 1992లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రారంభమైనప్పుడు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి సభ ‘స్వదేశీ’, ‘నిరుద్యోగం’ పై ఒక తీర్మానాన్ని ఆమోదిస్తూ దాదాపు ఇతరులపై ఆధారపడటం పెరుగుతూ ఉండడం ఆర్థిక బానిసత్వానికి, భారీ నిరుద్యోగానికి తీస్తుందని హెచ్చరించింది. మూలధన ఆధారిత, ఉపాధి అవకాశాలు తగ్గించే సాంకేతికత ఆధారంగా హైబ్రిడ్ సోవియట్-పాశ్చాత్య నమూనా తర్వాత మన ఆర్థిక అభివృద్ధిని రూపొందించే ప్రయత్నాలను నేరుగా గుర్తించవచ్చని తెలిపింది.
మన మేధో సంపత్తిని, మన జీవిత విలువలను, ప్రస్తుత పరిస్థితులు, అవసరాలు, మన ప్రజల భవిష్యత్తు ఆకాంక్షలను విస్మరించడం కాగలదని హెచ్చరించింది. వాజపేయి హయాంలో దత్తోపంత్ తెంగేది వంటి వారు ధర్నాలు కూడా చేయడంతో విదేశీ పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం పట్ల ప్రస్తుత తీర్మానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మోడీ ప్రభుత్వం చెబుతున్న ‘ఆత్మనిర్భర్ భారత్’ను స్వాగతిస్తూనే అందుకు విదేశీ అనుకరణ విధానాలు కాకుండా భారతీయ విలువలతో కూడిన ‘భారతీయ నమూనా’ అనుసరించాలని స్పష్టం చేసింది. ఆ నమూనా ఏ విధంగా ఉండాలో కూడా ఒక ఆలోచన కలిగించే ప్రయత్నం చేసింది. ఈ తీర్మానం గ్రామీణ ఉపాధి, అసంఘటిత రంగంలో, మహిళా ఉపాధి వంటి అంశాలను నిరుద్యోగ సమస్య పరిష్కారంకు మార్గంగా చూపింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా దేశంలో ఉత్పత్తి రంగంలో పురోగతి లోపించడం ఉపాధి అవకాశాలు తగ్గిపోవడానికి, అనుకున్న రీతిలో వృద్ధి సాధించలేక పోవడానికి ప్రధాన కారణాలుగా గుర్తు చేసింది.
మన సామాజిక పరిస్థితులకు అనువైన నూతన సాంకేతికతలను, తగిన సాఫ్ట్ స్కిల్స్‌ను అనుసరించాలని సూచించింది. అదే విధం గా ఈ లక్ష్య సాధనలో కేవలం ప్రభుత్వమే కాకుండా సమాజం కూడా తనవంతుగా కృషి చేయాలని, యువత కూడా ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా స్వయం ఉపాధికి ప్రయత్నం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ సూచించింది. నేడు దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడానికి అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు, కరోనా మహమ్మారితో స్తంభించిపోయింది. ఆర్థికాభివృద్ధి ప్రధాన కారణం అయినప్పటికీ, మౌలికంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు కూడా అనే అంశాన్ని పరోక్షంగా ఈ తీర్మానం గుర్తు చేసిన్నట్లు కనిపిస్తున్నది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారం, నిరుద్యోగిత రేటు 2018-19లో 6.3%, 2017-18లో 4.7% నుండి 2021 డిసెంబర్‌లో 7.91%కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో, ఇది జనవరి 2021లో 8.09% నుండి డిసెంబర్ 2021లో 9.30%కు, గ్రామీణ ప్రాంతాల్లో 5.81% నుండి 7.28%కు పెరిగింది. తయారీ రంగం 2019-20 నుండి డిసెంబర్ 2021 మధ్య 9.8 మిలియన్ల ఉద్యోగాలను కోల్పోయింది. ‘ఉపాధి కల్పన సమస్యపై ప్రభుత్వాన్ని నిందించడం సులభమే. కానీ సమాజంలో నెలకొన్న బలాన్ని ఉపయోగించకుండా, ఉపాధిని సృష్టించడం సాధ్యం కాదు. ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని అంతం చేయగలిగితే, ఎక్కడా నిరుద్యోగం ఉండదు. కాబట్టి స్వావలంబి భారత్ అభియాన్ పేరుతో ప్రచారం ప్రారంభించాము అని ఆర్ధిక విధానాలపై ఆర్‌ఎస్‌ఎస్ అభిప్రాయాలను తరచూ స్పష్టం చేస్తుండే స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కో- కన్వీనర్ అశ్వనీ మహాజన్ తెలిపారు.
ఉపాధి కల్పనను వికేంద్రీకరించడానికి, అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నం జరగాలని, తద్వారా ఉపాధి అంతా కొన్ని నగరాల్లో కేంద్రీకృతమై ఉండరాదని మహాజన్ భావిస్తున్నారు. ‘ఈ తీర్మానంలో ఈ ఆలోచనను పొందుపరుస్తున్నది. యువత వ్యవస్థాపకత మన బలం. అలాంటప్పుడు కేవలం ఉద్యోగాల ద్వారానే ఉపాధి ఉండాలని ఎందుకు అనుకోవాలి? 60-70 ఏళ్ల ఈ ఆలోచన మారాలి’ అని మహాజన్ స్పష్టం చేశారు. ఉత్పాదక రంగంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మద్దతు ఇచ్చేలా ప్రభుత్వంపై వత్తిడి తేవడం, ‘వ్యవసాయ -అనుబంధ కార్యకలాపాలు, ఇతర స్వయం ఉపాధి అవకాశాల ద్వారా వ్యవస్థాపక వ్యాపారాలలో నిమగ్నమవ్వడంలో వారికి సహాయపడటానికి ‘అట్టడుగు స్థాయి యువతతో కలిసి పని చేయడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ ఈ లక్ష్య సాధనలో పని చేసేందుకు కృషి చేస్తున్నది. మన తయారీ రంగం జిడిపిలో 17- 18% ఉండేది. ఇప్పుడు అది 15% కు తగ్గింది. ఎలక్ట్రానిక్స్, సైకిల్, బొమ్మలు వంటి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే మార్కెట్లను చైనా మాయం చేసింది. మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. చైనాపై ఆధారపడటం నానాటికీ తగ్గిపోతోంది. టారిఫ్ అడ్డంకులు సహా వివిధ మార్గాల ద్వారా తయారీని పెంచడానికి ప్రభుత్వం చాలా చేసింది. ఇప్పుడు సమాజం కూడా అందుకు తగ్గట్టుగా ఎదగాలి” అని మహాజన్ సూచించారు.
ఆర్‌ఎస్‌ఎస్, పరివార్‌లో ఆర్ధిక విధానాలపై ఆలోచనలు చేస్తున్న స్వదేశీ జాగరణ్ మంచ్‌తో పాటు బిఎంఎస్, కిసాన్ సంఘ్ వంటి ఐదు స్వతంత్ర సంస్థలు ఉన్నాయి. వీరంతా కర్ణావతిలో జరిగిన ప్రతినిధుల సమావేశాలకన్నా ముందు ఒక రోజంతా సమావేశమై దేశ ఆర్ధిక విధానాలు, దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్ధిక పరిస్థితుల గురించి సమాలోచనలు జరిపినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఆందోళనల నుండే ఈ తీర్మానం వెలువడినట్లు కనిపిస్తున్నది. గల్వాన్ లోయలో ఘర్షణ అనంతరం చైనా నుండి దిగుమతులను తగ్గిస్తూ, ‘భారత్‌లో తయారీ’ ని ప్రోత్సహిస్తున్నట్లు భారత ప్రభుత్వం విశేషంగా ప్రచారం చేస్తున్నా ఆచరణలో చైనాపై ఆధారపడటం పెరుగుతున్నది. పార్లమెంట్‌లో ప్రభుత్వం అందించిన గణాంకాల ప్రకారమే భారత్‌కు చైనా నుంచే అత్యధిక దిగుమతులు జరుగుతుండటం విశేషం. చైనా నుంచి భారత్‌కు 2020- 21(ఏప్రిల్, జనవరి)లో 52,045 మిలియన్ల యుఎస్ డాలర్లు దిగుమతులు కాగా, 2021-22 (ఏప్రిల్, జనవరి)లో 76,622 మిలియన్ల యుఎస్ డాలర్ల విలువ గల దిగుమతులు అయ్యాయి. అంటే దాదాపు మూడోవంతు పెరిగాయి. నివాదాలు ఇవ్వడం చూపుతున్న ఆసక్తిని నిర్దుష్టమైన విధానాలు అనుసరించడం పట్ల చూపక పోవడం, స్వాలంబన నినాదాలకు పరిమితం కావడం దురదృష్టకరం.

                                                                                   చలసాని నరేంద్ర, 9849569050

RSS Against Economic policies in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News