Wednesday, January 22, 2025

కేరళ గవర్నర్ సంఘీయ పోకడలు

- Advertisement -
- Advertisement -

దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను పక్కాగా అమలు చేసే ప్రయత్నం బిజెపి చేస్తున్నది. ప్రధానంగా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో ఇప్పటికే విద్యా రంగాన్ని పాఠ్యాంశాలను పూర్తిగా కాషాయమయంగా మార్చారు. రాష్ట్రాలలోనే కాదు దేశంలోను సిబిఎస్‌ఇ సిలబస్ రూపొందించే ఎన్‌సిఇఆర్‌టిని ఉపయోగించుకొని చరిత్ర, సైన్స్, జాతీయోద్యమ వీరుల చరిత్రల స్థానాలలో ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్తల జీవిత చరిత్రలను తీసుకురావడం, పురాణాలను యూనివర్శిటీ పాఠ్యాంశాలలో చేర్చడం చేస్తున్నారు. ఒక ప్రక్క నూతన విద్యా విధానం పేరుతో దేశ విద్యా రంగాన్ని మార్చాలనే కుట్రలు చేస్తూనే పాఠ్యాంశాల వక్రీకరణ చేస్తున్నారు.
కేవలం పాఠ్యాంశాలు మార్చడమే కాకుండా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను విద్యారంగంలో ప్రధానంగా యూనివర్శిటీలలో నియమిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. యుజిసి చైర్మన్ మొదలు జెఎన్‌యు, హెచ్‌సియు, పాండిచ్చేరి వంటి కేంద్ర యూనివర్శిటీల విసిలుగా, విద్యారంగంలో కీలకమైన పదవుల్లో వారి ఏజెంట్లను చేర్చి విద్యను కాషాయీకరిస్తున్నారు.

ఈ ఫార్ములాను ఉపయోగించే ఆర్‌ఎస్‌ఎస్‌ను, దాని భావజాలాన్ని ఎదిరించి నిలబడిన, నిలుస్తున్న కేరళపై ప్రయోగించాలనుకొంటున్నారు. దీనికి గవర్నర్‌ను ఉపయోగించుకొని కేరళ రాష్ర్ట యూనివర్శిటీలో ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్లను నియమించాలని ప్రయ త్నం చేస్తున్నది. సాధారణంగా రాష్ట్రాలలో గవర్నర్ ఎక్స్-అఫిషియో ఛాన్సలర్‌గా వున్నప్పటికీ విశ్వవిద్యాలయాల పని తీరులో వారు జోక్యం చేసుకోరు. కాని కేరళలో బిజెపి నియమించిన గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ చర్యలతో అది పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చర్యలు భారత దేశంలో వున్నత విద్యలో లౌకిక, వైజ్ఞానిక లక్షణాన్ని నాశనం చేశాయి.వేలాది మంది ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, ఎబివిపి సభ్యులను కళాశాలలు, యూనివర్శిటీల లో అధ్యాపకులుగా, ప్రొఫెసర్లుగా, ఇతర సిబ్బందిని నియమించడం ద్వారా యూనివర్శిటీల అడ్మినిస్ట్రేషన్‌లో ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులను నింపి వారి భావాలను విస్తృత పర్చడానికి చేసిన ప్రయత్నాలను కేరళలో వారు చేయలేకపోయా రు. కేరళలో అన్ని క్యాంపస్‌లలో ఎబివిపి ఆధిపత్యం సాధించలేకపోతున్నది.

మొదటి నుండి కేరళలో క్యాంపస్ లో విద్యార్థుల తరపున పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ వెనకాలే విద్యార్థులు వున్నారు. గత ఆగస్టు నుండి కేరళలో జరిగిన ఎన్నికలలో రాష్ర్ట, సెంట్రల్ యూనివర్శిటీల్లో ఎస్‌ఎఫ్‌ఐనే మతోన్మాద ఎబివిపిని మట్టికరిపిస్తున్నది. దీనిని నియంత్రించాలనే కుట్ర కూడా ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను కేరళలో తమ ప్రజలు విశ్వవిద్యాలయాలలో వారి ప్రజాస్వామిక పద్ధతులను అనుసరిస్త్తున్నంత వరకు రాష్ర్ట పరిపాలన సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్ కైవసం చేసుకోవడం, బోధన స్థానాలను మత ఛాందసవాదులతో నింపడం సాధ్యం కాదు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్ గవర్నర్‌తో కేరళ రాష్ర్ట యూనివర్శిటీలలో పాలక మండళ్లలో వారిని నియమించాలని అనుకుంటున్నారు.

వివాదం ఎందుకు?
కేరళ గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ కేరళ కాలికట్ యూనివర్శిటీల పాలక మండళ్లలో సంఘీలను నింపాలనే కుట్ర లో సెనేట్‌లో సభ్యులుగా నియమించాడు. పైగా ప్రశ్నించిన ప్రభుత్వం యూనివర్శిటీలలో గవర్నర్ జోక్యం ఏమిటని ప్రశ్నించిన ఎస్‌ఎఫ్‌ఐపై తన అక్కసును వెళ్లగ్రక్కి క్రిమినల్స్ అంటూ దూషించాడు. తాను చేసిన నియామకాల గురించి అడిగే హక్కు ఎవరికీ లేదని, అతని నిరంకుశత్వాన్ని, ప్రజాస్వామ్యం పట్ల ధిక్కారాన్ని వెల్లడించాడు. కేరళలోని కాలికట్, కేరళ యూనివర్శిటీల సెనేట్ సభ్యులను నియమించడమే కాదు,

గతంలో కేరళ ప్రభుత్వం యూనివర్శిటీలకు వైస్ -ఛాన్సలర్స్ నియమించే సందర్భంగా కూడా ప్రభుత్వం పంపిన సిఫార్సులను కూడా ఆమోదించకుండా ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులను నియమించే ప్రయత్నం చేశాడు. తమ రాష్ర్ట యూనివర్శిటీలను ఆర్‌ఎస్‌ఎస్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వం గవర్నర్ విశ్వవిద్యాలయాలలో రాజకీయ జోక్యం చేసుకునేందుకు వీలు లేకుండా, తమ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజల అభీష్టాన్ని గౌరవించాలని కేరళలో రాష్ర్ట యూనివర్శిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించాలని 2022 డిసెంబర్‌లో కేరళ అసెంబ్లీ ఒక చట్టాన్ని ఆమోదించింది.

బిల్లుపై సంతకం పెట్టకుండా ఒక సంవత్సరం పాటు నిరాకరించాడు. చివరికి సుప్రీం కోర్టు జోక్యంతో 2023లో రాష్ర్టపతికి పంపారు. నిరంతరం యూనివర్శీటీలలో రాజకీయ జోక్యం చేసుకోవడం, ఇప్పుడు కేరళ, కాలికాట్ యూనివర్శిటీ సెనేట్ సభ్యులను తనకు ఇష్టం వచ్చిన వారిని నియమించడం వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా క్యాంపస్ లలో ‘సంఘీ ఛాన్సలర్ గోబ్యాక్’, ‘మిస్టర్ ఛాన్సలర్, ఇది కేరళ’ అనే బ్యానర్లను అన్ని క్యాంపస్‌ల ముందు ప్రదర్శిస్తున్నారు. గవర్నర్ కాలికాట్ యూనివర్శిటీ పర్యటన సందర్భంగా యూనివర్శిటీ ముందు ఎస్‌ఎఫ్‌ఐ కట్టిన బ్యానర్లను తొలగించాలని

గవర్నర్ చిందులు వేస్తూ అధికారులను ఆదేశించి విద్యార్ధులను క్రిమినల్స్ అంటూ తిట్లు తిట్టాడు. ఒక్క ప్రక్క గవర్నర్ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఆర్‌ఎస్‌ఎస్ గవర్నర్‌కు అనుకూలంగా క్యాంపస్‌లలో బ్యానర్లు కట్టారు. ఇలాంటి చర్యలతో గవర్నర్ కేరళ క్యాంపస్‌లలో ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులను నింపాలనే కుట్రలకు వ్యతిరేకంగా తమ కంటే అర్హత తక్కువ వున్న వారిని నియమించారని కొంత మంది కేరళ హైకోర్టును ఆశ్రయించారు.దీంతో నియమకాలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. విద్యార్థులు మాత్రం రాష్ర్ట వ్యాప్తంగా ‘సంఘీ గో బ్యాక్’ అంటూ రాష్ర్టమంతటా ఆందోళనలు చేస్తున్నారు. విద్యార్థుల పోరాటం ప్రజాస్వామ్య పరిరక్షణ స్ఫూర్తిదాయకం.

విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించడం, మతోన్మాద ప్రయత్నాలు ప్రతిఘటించడం, కేరళలో ఉన్నత విద్య, లౌకిక, శాస్త్రీయ విద్యను పరిరక్షించుకోవడం కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం. పైగా దేశంలో నేడు బిజెపి రాష్ట్రాల సమాఖ్య హక్కులపై చేస్తున్న దాడికి, వారి ఫాసిస్టు హిందూత్వ అజెండకు వ్యతిరేకంగా రాష్ట్రాలను అస్థిరపరిచే గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేసేందుకు వారి ప్రయత్నాలకు బలమైన ప్రతిఘటనగా భావించాలి. తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి, మంచి కేంద్ర రాష్ర్ట సంబంధాలకు పూర్తి విరుద్ధమైనవిగా ఈ చర్యలు వున్నాయి. కేరళ, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలలో నేడు నెలల తరబడి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించడం లేదు.

కేరళలో జరుగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ, మతోన్మాద చర్యలకు వ్యతిరేక పోరాటంలో అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్‌లోని యుడిఎఫ్ పాత్ర కూడా అవమానకరంగా ఉంది. అక్కడ నుండి ఎన్నికైన 18 మంది ఎంపిలు మౌనంగానే వున్నారు. బిజెపి, కాంగ్రెస్ సమన్వయంతో రాష్ర్ట ప్రభుత్వంపై నిరసనలు కూడా జరుపుతున్నారు. గవర్నర్ నిర్ణయాలు, రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. వారి పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News