Wednesday, January 22, 2025

తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ యాత్రల విరమణ

- Advertisement -
- Advertisement -

RSS cancels Tamil Nadu route march

చెన్నై : తమిళనాడులో ఆదివారం నాటి ఆర్‌ఎస్‌ఎస్ యాత్రకు బ్రేక్‌పడింది. ఈ ప్రదర్శనను తాము విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్వయం సేవక్ సంఘ్ శనివారం తెలిపింది. తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీని కేవలం ఏదైనా మైదానం లేదా స్టేడియం లేదా కాంపౌండ్ వాల్ ఉన్న చోటనే నిర్వహించుకోవాలని ఈ మేరకే ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌కు అనుమతిని ఇస్తామని మద్రాసు హైకోర్టు ఒక్కరోజు క్రితం తెలిపింది. అయితే ఈ ఆదేశాలు తమకు సమ్మతం కాదని పేర్కొన్న ఆర్‌ఎస్‌ఎస్ తీర్పును తాము ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని తెలిపింది. ప్రస్తుతానికి ఆదివారం నాటి తమ యాత్రను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. తమిళనాడులో 44 చోట్ల తమ ప్రదర్శనకు ఆర్‌ఎస్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే వీటికి షరతులతో కూడిన అనుమతులు ఉంటాయని, గ్రౌండ్స్‌కు ఇవి పరిమితం కావాలని హైకోర్టు తెలిపింది. అయితే రాష్ట్రంలో కేవలం మూడు ప్రాంతాలలోనే ఆర్‌ఎస్‌ఎస్ యాత్రకు అనుమతి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తెలిపింది. దీనిపై సంఘ్ హైకోర్టును ఆశ్రయించింది.

అయితే శాంతియుతంగా ప్రదర్శనలు జరగాల్సి ఉంటుందని, ఏ విధంగా వీటిని నిర్వహించాలనేది తెలియచేస్తామని, వీటిని ఉల్లంఘిస్తే తదనంతర పరిణామాలను ఎదుర్కొవల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. వీధులలో ప్రదర్శనలకు వీలులేదని తెలిపింది. అయితే ఈ విధంగా వీధులలో ప్రదర్శనకు అనుమతిని ఇవ్వకపోవడం సరికాదని ఆర్‌ఎస్‌ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. కశ్మీర్, బెంగాల్, కేరళ ఇతర చోట్ల కూడా తాము ఎంచుకున్న మార్గాల గుండా యాత్రలు చేపట్టామని ఇక్కడ ఎందుకు వద్దంటున్నారనేది తెలియడం లేదని పేర్కొన్న సంఘ్ వర్గాలు ఆదివారం నాటి కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు వెల్లడిచింది. ఆదేశాలపై అప్పీల్ చేసుకుంటామని వివరించింది. అయితే కోయంబత్తూరు, పొల్లాచ్ఛి, నాగర్‌కోయిల్ వంటి మతపరమైన సున్నిత ప్రాంతాలలో ఈ ర్యాలీలు భావ్యం కావని ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి.

దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ర్యాలీలకు వీల్లేదని స్పష్టం చేసింది. కోయంబత్తూరులో దీపావళికి ఒక్కరోజు ముందే దేవాలయం వద్ద ఓ కారులో వంటగ్యాసు సిలిండర్ పేలింది. ఈ ఘటనలో జమీషా ముబిన్ అనే వ్యక్తి చనిపోయాడు. ఇప్పటికే ఈ పేలుడు మతపరమైన రంగును సంతరించుకుంది. ఘటనపై నియా దర్యాప్తు చేపట్టింది. ముబిన్ అనే వ్యక్తి ఈ అత్యంత సునిశిత మతపరమైన స్థలంలో బాంబులను అమర్చేందుకు యత్నించాడని,ఈ క్రమంలో పేలుళ్లు జరిగాయని దర్యాప్తు సంస్థలు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చాయి. శాంతిభద్రతల విషయం కీలకం అని, ర్యాలీలకు అనుమతి కుదరదని తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News