Saturday, December 21, 2024

ఆర్‌ఎస్‌ఎస్-జమాతే చర్చలు!

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమ దారికి తెచ్చుకోవటం అసాధ్యమా? కొద్ది వారాల క్రితం ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌తో కొన్ని ముస్లిం సంస్థల ప్రతినిధుల సమావేశం ఇప్పుడు కేరళలో వేడిపుట్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కేరళ పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అక్కడి సిపిఐ (ఎం) ఫిబ్రవరి 21నుంచి నెల రోజులు సాగే జాతాను కోజికోడ్‌లో సిఎం పినరయి విజయన్ ప్రారంభించారు. ఆ సందర్భంగా సిఎం ముస్లింలను బుజ్జగించేందుకు చూసినట్లు బిజెపి ధ్వజమెత్తింది. అంతకు ముందే ఆర్‌ఎస్‌ఎస్‌తో కేరళకు చెందిన మాయతే ఇస్లామిక్ హిందు సంస్థ ప్రతినిధులు దేన్ని గురించి చర్చించారో చెప్పాలంటూ పినరయి విజయన్ లేవనెత్తిన ప్రశ్న వేడిపుట్టించింది.

దాన్ని పక్కదారి పట్టించేందుకు బిజెపి ఎదురు దాడికి పూనుకుంది. సదరు సమావేశం గురించి ఇంతవరకు ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తమంత తాముగా వెళ్లి కలవలేదని ఆర్‌ఎస్‌ఎస్ ఆహ్వానం మేరకు వెళ్లినట్లు జమాతే వివరణ ఇచ్చుకుంది. అది వాస్తవం కాదని వార్తలు చెబుతున్నాయి. జమాతే సంస్థ ప్రధాన కార్యదర్శి టి ఆరిఫ్ జనవరిలో ఆర్‌ఎస్‌ఎస్‌తో జరిపిన చర్చల గురించి వెల్లడించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న మూక వధలు, అట్టడుగున ఉన్న తరగతుల అణచివేత అంశాలను చర్చించినట్లు పేర్కొన్నారు. ఇది జమాతే వంచన తప్ప మరొకటి కాదని విజయన్ ఫేస్‌బుక్ పోస్టు లో పేర్కొన్నారు. “ఆర్‌ఎస్‌ఎస్‌తో విభేదించే అంశాలున్నప్పటికీ చర్చలు జరపాల్సి ఉందని జమాతే చెప్పటం దాని వంచనను వెల్లడిస్తున్నది. ఏమి చర్చించారో, సమావేశం ఏ అంశం మీద జరిగిందో వివరించాలి. జమాతే తర్కం ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్ ఒక సంస్థ, చర్చల ద్వారా దాన్ని సంస్కరించవచ్చు, మార్చవచ్చు. ఇదెలా అంటే తోడేలు మచ్చలను నీటితో కడిగి పోగొట్టవచ్చు అన్నట్లుగా ఉంది. భారతలోని మైనారిటీలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలను దేశ యంత్రాంగాన్ని అదుపు చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ ముందుంచుతామన్న వాదన చేస్తున్న జమాతేకు అసలు దేశ మైనారిటీల ప్రతినిధిగా ఎవరు అధికారమిచ్చారు. ఏ అంశం గురించి చర్చించినప్పటికీ అది దేశంలోని మైనారిటీలకు సాయపడదు.

మైనారిటీల రక్షణ అంటే మత స్వేచ్ఛకు రక్షణ. దాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదెవరో చర్చల్లో పాల్గొన్న వారికి తెలియదా? అలాంటి వారితో చర్చించి లౌకిక వాదాన్ని, మైనారిటీలను ఎలా రక్షించగలం? సంఘ పరివార్ తీవ్రవాద హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేడు దేశంలోని లౌకిక శక్తులు పోరాడుతున్నాయి. ఇటువంటి దశలో అలాంటి చర్చలు ఆర్‌ఎస్‌ఎస్ అజండాకు మద్దతు ఇస్తాయి. మత శక్తులు కుమ్మక్కై ఐక్యంగా లౌకిక వాదాన్ని, ప్రజాస్వామిక విలువలను అణచివేస్తున్నాయనేందుకు ఇంతకంటే రుజువు అవసరం లేదు. లౌకిక శక్తులకు ఇదొక సవాలు ” అని విజయన్ పేర్కొన్నారు. జమాతే వైఖరిని కేరళలోని కేరళ ముస్లిం జమాత్, సమస్త కేరళ జమైతుల్ ఉలేమా, ముస్లిం లీగ్, కేరళ నదవతుల్ ముజాహిదీన్, సున్నీ యువజన సంఘం విమర్శించాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడి దానితో సఖ్యత కోరుకుంటున్నట్లు, స్వార్ధ ప్రయోజనాలున్నట్లు కొందరు జమాతేను విమర్శించారు. స్నేహపూర్వక చర్చల ద్వారా జమాతే చారిత్రక తప్పిదం చేసిందని కేరళ ముస్లిం జమాత్ కాంతాపురం ఎపి అబూబకర్ ముస్లియార్ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ భారత్‌కు, దేశ లౌకిక విలువలకు శత్రువని అటువంటి సంస్థతో చర్చలు శత్రువును కౌగలించుకోవటంతో సమానమని ముస్లిం జమాత్ పేర్కొన్నది. మతవాదం ఈ రెండు బృందాలను ముడివేస్తున్నది. భారత వ్యతిరేక ఫాసిస్టు శక్తుల నిజరూపాన్ని కప్పిపుచ్చేందుకు జమాతే ఇస్లామీ హింద్ ఒక పనిముట్టుగా మారుతున్నది” అని విమర్శించింది. ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చించాల్సినంత ప్రత్యేక పరిస్థితులేమీ లేవని ముస్లింలీగ్ నేతలు పికె కున్హాలీకుట్టి, ఎంకె మునీర్ పేర్కొన్నారు.

ముస్లిం సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్ జరిపిన రహస్య సమావేశం గురిం చి జనవరి 26న హిందూ పత్రిక వెల్లడించింది. సంఘ పరివార్ నేతలు ఇంద్రేష్ కుమార్, రావ్‌ులాల్, కృష్ణ గోపాల్ మూడు గంటల పాటు ఢిల్లీలోని మాజీ లెఫ్ట్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నివాసంలో జరిపిన భేటీలో అనేక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మాతే ఇస్లామీ హింద్, జమాతే ఉలేమా ఇ హింద్, అజ్మీర్ దర్గా సల్మాన్ చిస్తీ, తదితరులు ఉన్నారు. గతేడాది ఆగస్టులో ఇలాంటి సమావేశమే జరగ్గా ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్, నజీబ్ జంగ్, మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ, ప్రముఖ హోటల్ ఓనరు సయిద్ షెర్వానీ, జర్నలిస్టు షాహిద్ సిద్దికీ, మరి కొందరు పాల్గొన్నారు. దాని కొనసాగింపుగా జరిగిన జనవరి సమావేశంలో భగవత్ మినహా మిగిలిన ముస్లిం ప్రతినిధులంతా పాల్గొన్నట్లు కూడా హిందూ పత్రిక పేర్కొన్నది. ఇలాంటి సమావేశాలను తరచూ జరపటం ద్వారా సానుకూల సందేశాన్ని పంపటం ముఖ్యమని భాగస్వాములైన ఆర్‌ఎస్‌ఎస్ నేతలు భావించారు. ఈ దశలో సంస్థల అధిపతులు, సీనియర్ నేతలు రావటం మంచిది కాదని భావించినట్లు, సమావేశాలను తరువాత కూడా కొనసాగించాలని భావించినట్లు కూడా వెల్లడించింది. అనేక అంశాలను ముస్లిం నేతలు లేవనెత్తితే వాటికి సమాధానంగా ఆర్‌ఎస్‌ఎస్ నేతలు గోవుల అంశాల్లో హిందువుల మనోభావాలను గమనించాలని కోరినట్లు వెల్లడించింది.

ఆర్‌ఎస్‌ఎస్, జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధుల చర్చలు వెల్ఫేర్ పార్టీ బుర్రలో పుట్టిన ఆలోచన కాదా అని సిఎం విజయన్ కోజికోడ్ సభలో విమర్శించారు. కాంగ్రెస్‌లోని కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్ పట్ల సానుకూల వైఖరితో ఉంటారు. వెల్ఫేర్ పార్టీ, జమాతే పట్ల ముస్లిం లీగ్‌లోని కొందరు అదే విధంగా ఉంటారని అందువలన ఆ మూడు పార్టీల మధ్య ఉన్న ప్రత్యేక బంధం ఏమిటో, చర్చల గురించి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి కేరళ అభివృద్ధి పట్టదు, ప్రతిపక్ష కూటమి మౌనంగా ఉంటుంది, కేంద్రం మీద ఒక్క మాట కూడా మాట్లాడదు అన్నారు.

ఈ సభలో సిఎం పినరయి విజయన్ ప్రస్తావించిన మూడు సార్ల తలాక్ అంశంపై బిజెపి, కొన్ని మీడియా సంస్థలు వక్రీకరణలకు పూనుకున్నాయి. మూడు సార్లు తలాక్ చెప్పి భార్యను వదలి వేయటానికి సిపిఎం వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. అది చెల్లదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కనుక దాని మీద వేరే చట్టం అవసరం లేదన్నది సిపిఎం వైఖరి. అందువలన దాని మీద చట్టం చేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేయటాన్ని సిపిఎం ఖండించింది. తరువాత పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దాని ప్రకారం అలా ఎవరైనా విడాకులు తీసుకుంటే మూడు సంవత్సరాల వరకు శిక్ష వేయవచ్చు. ఇతర మతాలకు చెందిన వారి విడాకుల వివాదాన్ని సివిల్ కేసులుగా పరిగణించి ముస్లిం పట్ల క్రిమినల్ కేసుగా పరిగణించటాన్ని మాత్రమే సిపిఎం వ్యతిరేకిస్తున్నది తప్ప మూడుసార్ల తలాక్‌ను సమర్ధించలేదు. సిఎం పినరయి విజయన్ దాన్నే చెప్పారు తప్ప ముస్లింలను సంతుష్టీకరించలేదు.

ఖురాన్‌లో మూడు సార్లు తలాక్ అనే పద్ధ్దతే లేదని చెబుతున్నారు. అనేక దేశాల్లో అది లేని మాట నిజం. ఖురాన్‌లోని లేని దాని మీద మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేసినట్లు? అన్ని మతాల్లో అనేక అంశాలను కొత్తగా చొప్పించినట్లుగా మూడు సార్లు తలాక్ అనే దాన్ని కూడా చొప్పించారు. దాన్ని ఎవరూ సమర్ధించటం లేదు. వేదకాలంలో కులాలు లేవని చెబుతారు, చేసే వృత్తిని బట్టి కులం అన్నారు అంటారు. ఇప్పుడు కుల వృత్తులు లేకున్నా, సదరు వృత్తులు చేయకున్నా అదే కులాలతో పిలుస్తున్నారు, కించపరుస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ సెలవిచ్చినట్లుగా కులాలను సృష్టించింది పండితులు (బ్రాహ్మలు కాదు మేధావులని తరువాత వివరణ ఇచ్చుకున్నారు) అన్నదాని ప్రకారం ఉనికిలో ఉన్న కులాలను ఏం చేస్తారో కూడా చెప్పాలి కదా! వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు.

వాటి మీద చట్టాలను ఎందుకు చేయటం లేదు. కులాలను, వివక్షను, కొందరిని కించపరిచే వాటిని సమర్ధించే మనుస్మృతి, ఇతర పురాణాలను సమర్ధించటాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారా? వాటిని ప్రచురించి ప్రచారం చేసే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? సిపిఐ (ఎం) ప్రారంభించిన నెల రోజుల యాత్రలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని జనం ముందుకు తీసుకు వెళుతున్నారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చలు ఆ మూడు పార్టీలకు తెలిసే జరిగినట్లు సిపిఎం రాష్ర్ట కార్యదర్శి, యాత్ర సారథి ఎంవి గోవిందన్ పేర్కొన్నారు. లేకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌తో జమాతే మాట్లాడితే తప్పేముందని కాంగ్రెస్ నేత విడి సతీశన్ ఎలా అంటారు? ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు సిపిఎం ముందుకు తెచ్చిన అనవసర వివాదం అని ముస్లిం లీగ్ నేత కున్హాలీ కుట్టి చెప్పటం ఏమిటని ప్రశ్నించారు.

చర్చలు జరపటంలో ఆ రెండు పార్టీలకు ఎలాంటి తప్పు కనిపించటం లేదన్నారు. గాంధీ మహాత్ముడిని చంపిన, బాబరీ మసీదు కూల్చివేసిన భావజాలం గలవారితో సంప్రదింపులు తప్పులేదని కాంగ్రెస్, ముస్లింలీగ్ ఎలా చెప్పగలుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ యాత్రకు పికె బిజు మేనేజర్, సిఎస్ సుజాత, ఎం స్వరాజ్, కెటి జలీల్, జేక్ సి థామన్ సారథులుగా ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏడాది కాలంగా రావాల్సిన రూ. 40 వేల కోట్ల గురించి ఏ మీడియా మాట్లాడదు. పదవ ప్రణాళికలో కేరళకు కేంద్రం నుంచి 3.9 శాతం నిధులు వస్తే ఇప్పుడు 1.9 శాతానికి తగ్గినా మౌనంగా ఉంటుంది. జిఎస్‌టి పరిహారం రూ. 9,000 కోట్లు, రెవెన్యూ లోటు పరిహారం రూ. 6,716 కోట్లు ఇవ్వటం లేదని, రుణాలు తీసుకోవటం మీద పరిమితి విధిస్తే సాంఘిక సంక్షేమ పథకాలను ఎలా అమలు జరపాలని సిపిఎం ప్రశ్నిస్తోంది. రాజకీయ కారణాలతోనే ఇదంతా జరుగుతోందని విమర్శించింది.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News