బెంగళూరు : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంయుక్త కార్యదర్శిగా సేవలందించిన ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ నేత మదన్ దాస్ దేవి సోమవారం తెల్లవారు జాము 5 గంటల ప్రాంతంలో బెంగళూరు ఆస్పత్రిలో మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన 81 ఏళ్ల వృద్ధ నేత సుదీర్ఘకాలంగా అస్వస్థతతో బెంగళూరు లోని రాష్ట్రోత్తన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం పుణెకు తరలించిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయి.
అంతవరకు ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం బెంగళూరు లోని స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం కేశవ కృపలో మంగళవారం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతారు. ఆర్‌ఎస్‌ఎస్ పూర్తి ప్రచారక్‌గా సేవలందించిన మదన్‌దాస్ దేవీ ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా, ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ ( ఎబివిపి) వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించారు. జాతీయ స్థాయి బీజేపీ నాయకుల్లో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర వహించారు.
ప్రధాని మోడీ సంతాపం
మదన్‌దాస్ దేవీ మృతికి ప్రధాని మోడీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. “ఆయన తన జీవితమంతా దేశసేవకే అంకితం చేశారు. ఆయనతో నాకు అత్యంత సన్నిహితమే కాకుండా చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకునే అవకాశం కలిగింది. ఈ సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, కార్యకర్తలకు భగవంతుడు మనోనిబ్బరాన్ని కలిగించాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి ” అని తన సంతాప సందేశంలో నివాళి అర్పించారు.