మణిపూర్ హింసకు విదేశీ శక్తులే కారణమా
సహోదర సామరస్యంపై వెలుపలి విషం
వచ్చే సార్వత్రిక ఎన్నికల దశలో జాగ్రత్త
దసరా ఉత్సవ సభలో ఆర్‌ఎస్‌ఎస్ సంచాలక్ భగవత్
నాగ్‌పూర్: మణిపూర్‌లో ఇన్నేళ్లుగా సాగుతోన్న హింసాకాండకు సీమాంతర తీవ్రవాదులే కారణమా? అని ఆర్‌ఎస్‌ఎస్ నేత మోహన్ భగవత్ ప్రశ్నించారు. అక్కడ చల్లారకుండా ఉన్న హింసాగ్ని పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మోహన్ భగవత్ ఈ ఘటనలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లో మంగళవారం మోహన్ భగవత్ దసరా ఉత్సవ ర్యాలీని ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మణిపూర్ గురించి ప్రస్తావించారు. చాలా ఏండ్లుగా మణిపూర్‌లో మైతీ, కుక్కీ తెగలు పరస్పరం సహోదర భావంతో కలిసి మెలిసి జీవిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలోనే ఉన్నట్లుండి ఎందుకీ హింసాకాండ ఉవ్వెత్తున ఎగిసిపడింది? ఇది మణిపూర్ అంతర్గత వర్గాలకు ఏ విధంగానూ ఉపయుక్తం అయ్యే విషయం కాదు.
కేవలం విదేశీ శక్తులకే ఇటువంటి ఉద్రిక్త పరిస్థితి సానుకూలంగా ఉపయోగపడుతుంది. ఈ కోణంలో చూస్తే అక్కడి విధ్వంసకాండ, ఘర్షణలకు కారణం విద్రోహకరులైన విదేశీ శక్తులే అయి ఉంటాయా? పరిస్థితిని బట్టి చూస్తే ఇదే నిజమన్పిస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన సంచాలకులు అయిన భగవత్ అభిప్రాయపడ్డారు. ఈశాన్యంపై చాలా ఏండ్లుగా విదేశీ శక్తుల దుష్టకన్ను పడిందని గుర్తు చేశారు. మణిపూర్‌లో శాంతిపునరుద్ధరణకు సంఘ్ కార్యకర్తలు పనిచేయడం గర్వకారణం అన్నారు. ఇక వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ సందర్భంగా కొన్ని వర్గాలు భావోద్వేగాలు రెచ్చగొడుతారని, వీరి పట్ల అంతా జాగ్రత్తగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పిలుపు నిచ్చారు. దేశ ఐక్యతా, సమగ్రత, గుర్తింపు, ప్రగతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మీడియాను వాడుకునే కుహనా ఉద్ధ్ధారకులతో జాగ్రత్త
మార్క్ తోకలతో వచ్చే వారితోనే అరాచకం
కొన్ని సంఘు విద్రోహశక్తులు తమను తాము సాంస్కృతిక మార్కిస్టులమని ప్రచారం చేసుకుంటున్నారని, అయితే వారు మార్క్‌ను విస్మరించారని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత తెలిపారు. కాలరెగరేసుకునే కల్చరల్ మార్కిస్టులు తమకు తామే సమాజ ఉద్ధారకులమని ప్రచారం చేసుకుంటారు. వీరు ఏదో విధంగా మీడియాను, విద్యారంగాన్ని ప్రభావితం చేస్తారు. తద్వారా దేశ విద్యా, సాంస్కృతిక రంగాలను కలుషితం చేసేందుకు యత్నిస్తున్నారని, వీరు తీవ్రవాదుల కంటే ప్రమాదకరం అన్నారు. తమకు మీడియాపై ఉండే ఆధిపత్య ధోరణితో ఈ స్వార్థపరులు, వివక్షాయుతులు, నయవంచక శక్తులు దేశాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు.
తాము ఏవో లక్షాల కోసం పాటుపడుతున్నామని చెప్పే వీరు నిజానికి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసి, ఘర్షణలు రెచ్చగొట్టేందుకే యత్నిస్తున్నారని ఆరోపించారు. వీరు అనేక రకాల తోకలు తగిలించుకుంటారు. తమను తాము సాహితీకారులమని, సాంస్కృతికవేత్తలమని, సమాజ పరిరక్షకులమని చెపుతుంటారు. అయితే నీతులు చెప్పే వీరు ప్రోత్సహించేది , వ్యాప్తి చేసేది కేవలం అరాచకం అని నిరసన వ్యక్తం చేశారు. వీరు పనిగట్టుకుని పలు రకాల ముసుగులతో చేసే పనులతో దేశంలో సామాజిక వాతావరణం గందరగోళంలో పడుతుంది. విద్యా, మీడియా, రాజకీయాలలో కూడా అనుచిత ధోరణులు ఏర్పడుతాయి. చివరికి అవినీతి కూడా తాండవిస్తుందని విమర్శించారు.