మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో లాక్‌డౌన్ విధించి ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు కార్యకలపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈగడువులోగా ప్రజలు తమకు అవసరమైన పనులు చేసుకోవచ్చని పేర్కొంది. అదే విధంగా నగరంలో ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్న ఆర్టీసీ, మెట్రోరైల్ కూడా నాలుగు గంటల పాటు నడుపుతున్నట్లు ఆయా శాఖల అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 33శాతం ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించడంతో పాటు, ప్రైవేటు సంస్దలో పనిచేసేవారు కూడా వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంతో వారి రాకపోకలకు ఇబ్బందులు రాకుండా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. నగర ప్రజలు వివిధ పనుల కోసం వెళ్లేవారు ఆర్టీసీ బస్సులు, మెట్రోరైళ్లలో సుఖవంతంగా ప్రయానించవచ్చని, గతంలో మాదిరిగానే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సర్వీసు- నడుపుతామని వెల్లడించారు. మెట్రో తన మొదటి రైలును సంబంధిత టెర్మినల్ స్టేషన్లు నుండి ఉదయం 7గంటలకుప్రారంభిస్తుందని, చివరిరైలు ఉదయం 8.45 గంటలకు మొదలై 9.45గంటలకు సంబంధిత టెర్మినేషన్ స్టేషన్లలో ముగుస్తుందని తెలిపారు.