డెహ్రాడూన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను కాపాడిన హర్యానా ఆర్టిసి డ్రైవర్, కండక్టర్లను సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26న జరిగే ఓ కార్యక్రమంలో పంత్‌ను కాపాడిన డ్రైవర్, కండక్టర్‌లను సత్కరించనున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా ప్రకటించారు. పంత్ ప్రమాదానికి గురైన సమయంలో డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరమ్‌జీత్‌లు తమ ప్రాణాలను సయితం ఫణంగా పెట్టి అతన్ని కాపాడారని సిఎం ప్రశంసించారు.
ప్రమాదం జరిగిన వెంటనే వీరిద్దరూ నిమిషాల్లోనే స్పందించి పంత్‌ను కారు నుంచి బయటకు తీశారని, దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడని సిఎం వివరించారు. ఓ వర్ధమాన క్రికెటర్‌ను కాపాడిన హర్యానా డ్రైవర్, కండక్టర్లను ఎంత ప్రశంసించిన తక్కువేనన్నారు. కాగా, జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వీరిని సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సిఎం పేర్కొన్నారు.