Wednesday, January 22, 2025

నిజామాబాద్ ఎంపి పనికిమాలిన వాడు…. ప్రధాని మోడీ అబద్ధాల పుట్ట

- Advertisement -
- Advertisement -

బిజెపి నేతలు ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు
ఆర్‌టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపణ

RTC Chairman Bajireddy Govardhan allegations
మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి పనికిమాలిన వాడని, ప్రధాని మోడీ అబద్ధాల పుట్ట అని బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసి చైర్మన్ ఆరోపించారు. శనివారం ఆయన బస్‌భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఎంపిలు గెలిచి రెండున్నర ఏళ్లు అవుతున్నా ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారన్నారు. ప్రధాని దేశంలో ఏ ఒక్కరికీ సంక్షేమపరంగా ఒక్క పథకం ప్రవేశపెట్టలేదన్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తానని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. టిఆర్‌ఎస్ పార్టీ ప్రజల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కరోనా సమయంలో కూలీలు, కార్మికుల కోసం అనేక సహాయక చర్యలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందని బిజెపి నాయకులు కనీసం కూలీలకు డబ్బులు ఇవ్వలేదన్నారు. బయటిదేశంలో ఉన్న కార్మికుల కోసం ప్లైట్‌లను కూడా పంపించామన్నారు. పసుపుబోర్డు తెస్తానని మాట ఇచ్చి మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. పసుపుబోర్డు ఉంటే అదనంగా ధరలు వచ్చేవని, కానీ ఎంపి మాకు ఒక జోకర్‌లా దొరికాడని ఆయన ఆరోపించారు. దర్ఫల్లిలో పసుపు రైతులపై రాళ్ల దాడి చేయించిన ఘనత బిజెపి నాయకులకే దక్కుతుందన్నారు.

ఏమీ చేయని వారు పెత్తనం చేస్తున్నారు

విగ్రహానికి అన్ని పార్టీల నాయకులు చందాలు ఇచ్చారని దానిపై బిజెపి ఎంపిని పిలిచి విగ్రహా ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ చేయని వారు పెత్తనం చేస్తున్నారని ఆయన విమర్శించారు. విగ్రహావిష్కరణ ముసుగులో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ముస్లింలు మక్కాకు పోతే డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, ఆలయాలకు, పండితులకు కూడా ప్రభుత్వం డబ్బు ఇస్తుందని, మీకు ఈ విషయంలో కళ్లు దొబ్బాయా అని బిజెపి నాయకులను ఆయన ప్రశ్నించారు. నోరుమంచిది కాకపోతే తన్నులు తింటారని, అడ్డగోలుగా మాట్లాడుతూ జిల్లాలో తిరిగితే కచ్చితంగా తంతారని ఆయన పేర్కొన్నారు. చైనాతో యుద్ధం చేయాలనుకుంటే ఇజ్రాయిల్ ఆయుధాలు కొంటావు, అది ముస్లిం దేశం కాదా, పెట్రోల్, డీజిల్ కోసం దుబాయ్ పోతావ్ అవి ముస్లిం దేశాలు కావా అని బాజిరెడ్డి బిజెపి నాయకులను ప్రశ్నించారు.

అదనంగా పథకాలు అమలు చేస్తున్నాం

సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలతో పాటు అదనంగా పథకాలను అమలు చేస్తున్నారని, ప్రతిరోజు మేం ప్రజల్లో తిరుగుతూ పథకాలను అమలు చేస్తున్నామని, మీరేం చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉడత ఊపులకు చింతకాయలు రాలవని, సిఎం కెసిఆర్ బిజెపి ముసుగు తొలగిస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీపై ముఖ్యమంత్రి మాట్లాడితే రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండు దొందుదొందేనని ఆయన తెలిపారు. కెసిఆర్‌ను ఎదుర్కొనే శక్తి ప్రధాని మోదీకి లేదన్నారు.

తామిచ్చిన డబ్బును ఉత్తరాదికి తీసుకెళ్లి

హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందుతుందో చూస్తలేరా అని ఆయన బిజెపి నాయకులను ప్రశ్నించారు. తామిచ్చిన డబ్బును ఉత్తరాదికి తీసుకెళ్లి అక్కడ అభివృద్ధి చేస్తున్నారన్నారు. గ్రామాలకు మేము పోలీసుల రక్షణ లేకుండా వెళతామని, పనిదొంగలు సిగ్గు శరం లేకుండా గ్రామాలకు ఏదో అడ్డుపెట్టుకొని వస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక్క ఇంట్లో మూడుపార్టీలా ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు. ఎస్‌ఐకు, సర్పంచ్‌కు గాయాలయ్యాయని దానికి ఎంపి అరవింద్‌కుమారే కారకుడని బాజిరెడ్డి ఆరోపించారు. తప్పుడు మాటలు చెప్పే వారిని ప్రజలు నిలదీయాలన్నారు.

రూ.90 కోట్లతో 400 బస్సుల కొనుగోలు

ఆర్టీసి ఎండి సజ్జనార్, తాను కలిసి ఈ సంస్థను గాడిలో పెట్టడానికి అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. సిబ్బంది, కార్మికులు చాలా కష్టపడుతున్నారన్నారు. గతంకన్నా ప్రస్తుతం పరిస్థితి మెరుగయ్యిందన్నారు. 1200 మంది కారుణ్య నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు. 3 వేల మంది రిటైర్‌మెంట్ రూ.500 కోట్లు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం అవసరం పడుతుందన్నారు. రూ.90 కోట్ల నిధులతో 400 బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. 2828 బస్సులు అవసరం ఉండగా, కొన్ని బస్సులను మాడిఫై చేశామన్నారు. స్క్రాప్ ద్వారా కొంత ఆదాయం వస్తుందని, ఆర్టీసి పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఆర్టీసి ఆదుకోవడానికి సిఎం కెసిఆర్ సహాయ, సహకారాలు అందిస్తున్నారన్నారు. సమ్మక్క సారక్క జాతరకు ఊహించిన ఆదాయం రాలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News