మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎప్పటికప్పుడు తన మార్కుతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఆర్టీసి ఎండిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థ అభ్యున్నతి కోసం సజ్జనార్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి మరింత ఆదరణ తీసుకొచ్చేలా తానే స్వయంగా రంగంలోకి దిగి ఆర్టీసిని పరుగులు పెట్టిస్తున్నారు. అప్పుడప్పుడు స్వయంగా బస్సు ప్రయాణం చేస్తూ ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఆర్టీసి ఎండి సజ్జనార్ మరోసారి సాధారణ ప్రయాణికుడిగా మారారు. సిటీబస్సు ఎక్కి తన కార్యాలయానికి సామాన్యుడిలా ప్రయాణం చేశారు. ఇప్పటికే పలుమార్లు సామాన్యులతో కలిసి బస్సు ప్రయాణం చేసిన సజ్జనార్ ఈసారి ప్రత్యేకంగా ‘బస్‌డే’ను పాటిస్తూ సంస్థ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారు.
ప్రతి గురువారం ‘బస్‌డే’గా
ఆర్టీసీ సంస్థకు సంబంధించిన పరిపాలన విభాగపు అధికారులు, ఉద్యోగులు ప్రతి గురువారం ‘బస్‌డే’గా పాటించి అందరూ బస్సులలోనే ప్రయాణించాలని ఇటీవలే సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం స్వయంగా బస్సులో ప్రయాణించి మిగతా ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారు. గురువారం ‘బస్‌డే’ పాటించిన సజ్జనార్ తన నివాసం నుంచి లక్డీకాపూల్ మీదుగా టెలిఫోన్‌భవన్ వరకు కాలినడకన వచ్చారు. అక్కడి బస్టాప్‌లో కాసేపు సమయం గడిపారు. తానెవరో తెలియకుండా బస్టాప్‌లో తనతోపాటు ఉన్న ప్రయాణికులతో మాటకలిపారు. బస్సుల సమయపాలన, సిబ్బంది ప్రవర్తన పనితీరు, బస్సుల్లో శుభ్రత, కార్గో సేవలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన మెహిదీపట్నం డిపోకు చెందిన రూట్ నెంబర్ 113 ఐఎం బస్సెక్కారు. స్వయంగా టికెట్టు కొనుక్కొని బస్‌భవన్ వరకు ప్రయాణించారు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి ఆర్టీసి బస్సులోనే ప్రయాణించి సంస్థ అభ్యున్నతికి తమవంతు సహకారం అందించాలని ప్రజలకు, ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
RTC MD Sajjanar travelling in City Bus