Friday, November 22, 2024

ఆదాయ వనరులను సమకూర్చుకోడానికి ఆర్టీసి ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

ఖాళీ స్థలాల లీజుపై అధికారుల కసరత్తు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆదాయ వనరులను సమకూర్చుకోడానికి తెలంగాణ ఆర్టీసి ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా మిగిలిపోయిన ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్‌లలోని నాలుగు ప్రాంతాల్లో మొత్తం 13.16 ఎకరాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ స్థలాల నుంచి నెలవారీ లీజు రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో భాగంగా ఆర్టీసి ఈ ప్రణాళికలు రూపొందిస్తోంది. కాచిగూడలో ఆర్టీసికి 4.14 ఎకరాల (1.80 లక్షల చ.అ) ఖాళీ స్థలాన్ని ఒక్కో చదరపు అడుగు రూ. 14.83గా బేస్‌ప్రైస్‌గా ఆర్టీసి నిర్ణయించింది. నెలకు లీజు రూపంలో ఈ స్థలం నుంచి రూ. 26.74 లక్షల చొప్పున ఆదాయం ఆర్టీసి సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.
పదేళ్ల పాటు లీజుకు…
సికింద్రాబాద్ రీజయన్ పరిధిలోని మేడ్చల్‌లో 2.83 ఎకరాలను (1.23 లక్షల చ.అ.), హకీంపేటలో 2.93 ఎకరాలను (1.27 లక్షల చ.అ.), శామీర్‌పేట్‌లో 3.26 ఎకరాలు (1.42 లక్షల చ.అ.)ను కూడా లీజుకు ఇవ్వాలని ఆర్టీసి నిర్ణయించింది. ఈ నాలుగు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను ప్రారంభంలో పదేళ్ల పాటు లీజుకు ఇవ్వాలని ఆర్టీసి నిర్ణయించింది. టెండర్ రూపంలో వీటిని లీజుకు ఇవ్వాలని భావించిన ఆర్టీసి గోడౌన్‌లు, వేర్‌హౌజ్‌లు, ఆటోమొబైల్ సర్వీస్ స్టేషన్లు, షోరూంలు, ఇలాంటి వ్యాపారాలు నిర్వహించుకోడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్థలాల్లో తాత్కాలిక లేదా సెమీ -పర్మినెంట్ పద్ధతిలోనే కట్టడాలు ఉండాలని, శాశ్వత కట్టడాలకు అనుమతి ఉండదని ఆర్టీసి తెలిపింది. వాటి నిర్వహణకు అవసరమైన అన్ని రకాల పర్మిషన్లను లీజుకు తీసుకున్నవారే సమకూర్చుకోవాల్సి ఉంటుందని కూడా పేర్కొంటుంది. ఈ నెల 18వ తేదీలోగా టెండర్లకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆ మరుసటి రోజు ఫైనల్ నిర్ణయం వెలువడుతుందని ఆర్టీసి క్లారిటీ ఇచ్చింది. టెండర్ దక్కించుకున్న సంస్థ మాత్రమే లీజుతో అక్కడ వ్యాపార లావాదేవీలను నిర్వహించాల్సి ఉంటుందని, ముందస్తు అనుమతి లేకుండా సబ్ లీజుకు ఇవ్వడం కుదరదని పేర్కొంది.
మొత్తం 13 ఎకరాల ఖాళీ స్థలం
కాచిగూడలో ఖాళీగా ఉన్న మొత్తం విస్తీర్ణం 4.14 ఎకరాలు (1,80,338 చ.అ) కాగా, దానికి బేస్ ప్రైస్ రూ. 14.83 (ఒక్కో చ.అ.కు)
లైసెన్సు ఫీజు : రూ. 26,74,418 (నెలకు) ఆర్టీసి నిర్ణయించింది. ఇక మేడ్చల్‌లోని ఖాళీ స్థలం విస్తీర్ణం : 2.83 ఎకరాలు (1,23,274 చ.అ) కాగా, దానికి బేస్ ప్రైస్ రూ. 6.25 (ఒక్కో చ.అ.కు), దీంతోపాటు లైసెన్స్ ఫీజు : రూ. 7,70,467 (నెలకు) నిర్ణయించింది.

ఇక హకీంపేట్‌లోని మొత్తం విస్తీర్ణం 2.93 ఎకరాలు (1,27,630 చ.అ) కాగా, దానికి బేస్‌ప్రైస్ : రూ. 3.00 (ఒక్కో చ.అ.కు), లైసెన్స్ ఫీజు రూ. 3,82,892 (నెలకు) నిర్ణయించారు. శామీర్‌పేట్‌లోని ఖాళీ స్థలం మొత్తం విస్తీర్ణం 3.26 ఎకరాలు (1,42,005 చ.అ) కాగా,దాని బేస్ ప్రైస్ రూ. 3.00 (ఒక్కో చ.అ.కు), లైసెన్స్ ఫీజు : రూ. 4,26,016 (నెలకు)గా నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News