ఉదయనిధి స్టాలిన్ ఆరోపణ
చెన్నై : కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ త్రిభాషా విధానం, నీట్, కొత్త విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏదో విధంగా తమిళనాడుపై హిందీని ‘రుద్దడమే’ అని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆదివారం ఆరోపించారు. చెన్నైలోని నందనం ఆర్ట్ కళాశాలలో ఒక ఆడిటోరియంను ప్రారంభించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఉదయనిధి కేంద్రం ‘కుట్ర’ పట్ల అప్రమత్తంగా ఉండవలసిందని వారిని కోరారు. నీట్, త్రిభాషా విధానం ద్వారా తమిళనాడులోని విద్యా వ్యవస్థకు ముప్పు కలిగిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన నిశితంగా విమర్శించారు.
‘విద్యపై కేంద్రం కుట్రలు, అది కలిగిస్తున్న ముప్పులను మీరు అర్థం చేసుకోవాలి. మీ వైఖరిపై మీరు గట్టిగా నిలబడితే మన శత్రువులు మనపై నెగ్గజాలరని మీరు గ్రహించాలి’ అని ఆయన అన్నారు. రూ. 4.80 కోట్ల వ్యయంతో కళాశాలలో వెయ్యి సీట్ల సామర్థంతో నిర్మించిన ఆడిటోరియానికి ఉదయనిధి ప్రారంభోత్సవం చేశారు. మాజీ ముఖ్యమంత్రరి ఎం కరుణానిధి పేరిట ఆడిటోరియానికి ‘కలైఙర్ కలై అరంగం’ అని నామకరణం చేశారు. రాష్ట్రంలో హిందీ ‘నిర్బంధం’ పట్ల నిరసన సూచకంగా 1986లో నందనం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారని ఉదయనిధి గుర్తు చేశారు.