Saturday, November 23, 2024

తెలంగాణ జీవన బింబం ‘రూబిడి’

- Advertisement -
- Advertisement -

Rubidi the image of life in Telangana

 

కథ, కవిత, వ్యాసం ఏదైనా పుస్తకంగా రావడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. అది ఒక్క రచయితే రాసింది కావచ్చు లేదా పలువురు రాసిన వాటి సంపుటీకరణ కూడా కావచ్చు. మొత్తానికి పుస్తకంగా రావడమే పెద్ద పని. చేతనయినవాళ్ళు సొంత పుస్తకాలు వేసుకుంటున్నా, పది మంది రచనలతో సంపుటాలు వేసేవాళ్లకు నిజానికైతే ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనముండదు. సాహితీ సేవ అనే సంతృప్తి తప్ప. వీటి ముద్రణ వల్ల పుస్తక సంపాదకులకు వచ్చే గుర్తింపు కన్నా రచయితలకు మరోసారి దక్కే పాఠకుల ప్రశంసలే ఎక్కువ. అయితే ఏదో ఓ చెయ్యి ఎత్తి పట్టుకుంటే తప్ప ప్లాకార్డు పైకి కనిపించదు. చెయ్యి కోరుకునేదల్లా దానిని నలుగురు చదువాలనే. ఇలాంటి చేతులెన్నుంటే అంత సామాజిక ప్రయోజనం ఉంటుంది. ఈ విషయంలో తెలంగాణాలో గత కొన్నెండ్లుగా ఎత్తింది దించకుండా పైనే ఉన్నచేయి పేరు సంగిశెట్టి శ్రీనివాస్. నేటి తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక జెండా రెపరెపల్లో, బహుజన ఆత్మగౌరవ నిట్టాడులో ఆయనకు పాలు ఉంటది.

సంగిశెట్టి శ్రీనివాస్ యేటా వేస్తున్న వివిధ పుస్తకాలతో పాటు వెల్డంది శ్రీధర్ తో కలిసి సంపాదకద్వయంగా 2013 నుండి క్రమం తప్పకుండా ’తెలంగాణ కథ’ అనే వార్షిక కథా సంపుటిని తెస్తున్నారు. ఈ కథల పుస్తకంలో ఆ సంవత్సరంలో పత్రికల్లో వచ్చిన తెలంగాణ కథల్లో ఎంపికైనవి ఉంటాయి. ఈ దారిలో 2019 లో వచ్చిన కథలతో వేసిన సంపుటి ’రూబిడి’. నేను చెప్పినని ’రూబిడి’ చేస్తావా అంటే ’నిరూపిస్తవా’ అనే అర్థంలో ఈ పదాన్ని తెలంగాణాలో వాడుతుంటారు. రూబిడి అంటే సాక్ష్యం అని పుస్తకంలో చెప్పారు.

నిజానికి సార్థక నామధేయత ఈ పుస్తకానికుంది. కథలు ఆ మాటను నిలబెట్టేలా ఉన్నాయి. అయితే కథల్ని విశ్లేషిస్తూ ముందుమాటగా సంపాదకులు రాసిన ’మొఖాభిలా’ లో చివరన – ’2019 ఎంతో సంక్షోభాన్ని మిగిల్చిపోయిన సంవత్సరమే. అయినా కథకులెందుకో చాలా సమస్యల్ని పట్టించుకోలేదు’ అని కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. కథలు రాస్తున్నవారు గమనించవలసిన విషయమిది. కథలకేం కొదువ లేదు, ప్రతి యేడు పుస్తకం తేవడానికి సిద్ధంగా ఉండండి అనే హామీ కలిగేలా మరిన్ని మంచి కథలు రావాలి.

రూబిడి పన్నెండు కథల సంపుటి. వాటిలోకి వెళితే- ’అలివి వల’ కొత్త వస్తువు కథ. నది ఒడ్డున చేపలు పట్టుకొని బతికే చెంచుల జీవితాలపై కంపెనీ విసిరిన ప్రాణాంతక వల ఇది.. కాగితాల్లో దుమ్ముకొట్టుకుపోతున్న గిరిజన సంక్షేమ చట్టాల సాక్షిగా నాగరిక బద్మాషీని తెలియజెప్పే కథ. అడవి బిడ్డలపై వచ్చే కథలు తక్కువ. ఆ లోటును రచయిత ఉదయమిత్ర తీర్చారు.
‘ఎక్కాలు రానోడు’ – హనీఫ్ రాసిన చిన్న కథ. ఇందులో రచయిత కొత్తగా చెప్పిందేమీ లేదు. ముగింపులో ఎలాంటి దిశా సంకేతం లేదు. తెలంగాణాలో పాలనను సూటిగా విమర్శిస్తూ వడ్డెబోయిన శ్రీనివాస్ రాసిన కథ ’భూమాట’. ఇది భూ మాట కాదు, భూమి ఆట. ఉచిత మూడెకరాల భూపంపిణీ ప్రహసన మోసంతో పాటు, ప్రభుత్వం ఉద్యోగాల్ని భర్తీ చేయకపోవడం పట్ల నిరసన కథలో సమాంతరంగా నడుస్తుంది. ఎటు దిరిగి పోరాటమే దిక్కని చెప్పే ఈ కథ రచనాపరంగా సాధారణ స్థాయిని దాటలేదు.

చెప్పాలనుకునే అంశానికి పెనవేసుకుపోయే నైసర్గిక వాతావరణాన్ని జోడించి కథ చెప్పడం ఓ కళ. అప్పుడే కథ చదివినట్లో, విన్నట్లో కాక చూసినట్లుంటది. ఈ విధానాన్ని ఒడిసి పట్టుకున్నవాడు మేడి చైతన్య. ఆయన రాసిన ’ఇత్తరాకుల తట్ట’ కథ పేదరికమంటే బట్ట, పొట్టకే కాకుండా ఆత్మగౌరవం కూడానని చెబుతుంది. ఆర్థిక సమస్యల కన్నా జీవన సమస్యలు మరింత దుర్భరంగా ఉంటాయని చెప్పే కథ ఇది. రాయడమంటే పరిశోధన, పరిశీలన అనుకుంటే తప్ప కథ ఇంత సహజత్వాన్ని నింపుకోదు.

‘ఏకగ్రీవం’ ను రచయితనే ’అను ఓ ఎన్నికల కథ’ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునే విధానం వెనుక జరిగే బాగోతంతో కథను చక్కగా నడిపించారు పెద్దింటి అశోక్. ’ఎలచ్చన్లంటే ఎలచ్చన్ల లెక్కనే ఉండాలె గని ఉన్న ఒక్క ఓటు అక్కును కూడా లేకుంట జేత్తే ఎట్ల’ అని కొమ్ము బాలమల్లు వల్దు రాయమల్లు అనే పాత్ర ద్వారా ప్రభుత్వానికి సవాలు విసురుతాడు రచయిత.

కావేటి సరిత రాసిన ’ఆరు తప్పులు’ ఓ సాహసోపేతమైన రచన. వాస్తవానికిది రెండు పాత్రల గల్పిక. రిజర్వేషన్ వల్ల గ్రామ సర్పంచ్ అయిన దళిత మహిళ రేణుక, ఆ పెద్దరికాన్ని కోల్పోయిన రాజేందర్ రెడ్డి అనే రెండు భిన్న ధ్రువాల మాటల ద్వారా రచయిత్రి బయటపెట్టిన కులవైషమ్యమే వస్తువు. కథ చదువుతుంటే రావిశాస్త్రి రచనాశైలి గుర్తొస్తది.
బానిసకొక బానిస కథ క్రోనీ క్యాపిటలిజం ఆధారంగా అల్లుకున్న కథ. హాస్పిటల్ కట్టి అందరి ఆరోగ్యానికి హామీ ఇచ్చే బదులు ట్విట్టర్ లో వచ్చిన రోగి మనవికి స్పందించి చేసే చిన్న సాయాన్ని ప్రచారం చేసుకొని గొప్ప పేరు ఎలా పొందచ్చో చెప్పే ఈ కథ రాసింది స్నేహ.

వర్తమాన దళిత ప్రాతినిధ్య రచయిత గుడిపల్లి నిరంజన్ రాసిన ’గుండె నిండా జీలుబండనే’ కథను ఇంకొకరు రాయడం కష్టమే. మాదిగల చిన్న చిన్న సుఖాలను కూడా చూసి ఓర్వలేని పటేండ్ల కుట్ర.. మాదిగ్గేరిని ఎలా చిన్నాభిన్నం చేస్తుందో ఈ కథలో చూడచ్చు. కథను నిలబెట్టిన నాగర్ కర్నూల్ వాడుక పదాలు కొత్తగా, ఇష్టంగా అనిపిస్తాయి.

సొంతానికి రాసుకుంటే చాటుగా మనం చదివినట్లుంటాయి పూడూరి రాజిరెడ్డి కథలు. తీరా చదివాక ఓ బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సత్యజిత్ రే తన సినిమా షాట్ లను తెరపై ఇలా రావాలని పెన్సిల్ తో స్కెచ్ లు వేసుకునేవాడట. రాజిరెడ్డి కథల్లో చిన్న అంశానికి కూడా అంతటి ప్రాధాన్యత ఉంటది. ఈ సంపుటిలోని ఆయన రాసిన కొండ కథ కూడా ఆ బాపతుదే. ఊర్లో ఇల్లూటపు అల్లుడు లింగయ్య, ఆయన భార్య చంద్రమ్మ, వారి కొడుకు బుచ్చిరెడ్డి, బట్టలకు, కోడ్ని కోయడానికి వచ్చిన చాకలి మైసయ్య కథలోని పాత్రలు. బద్దకపు బుచ్చిరెడ్డి, ఇంట్లో గౌరవం దక్కని లింగయ్య, కొడుకును గావురంగా మొగుణ్ణి ఈసడింపుగా చూసే చంద్రమ్మ చుట్టూ కథ సాగుతుంది. కథకు కొండ అని పేరు పెట్టడానికి రచయిత ఏ పాత్రను ప్రతీకగా తీసుకున్నాడో ఎవరికివారే తేల్చుకోవాలి.

‘పెసిరెంట్ పోశెట్టి’ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నాగవర్ధన్ రాయల రాసిన వ్యంగ్య కథ. ఊర్లోకి బస్సు రాకపోవడంపై రెండు వర్గాల మధ్య చర్చ మొదలవుతుంది. చివరగా ప్రజల ఆగ్రహాన్ని చూసి పోశెట్టి పరుగులు పెడతాడు. ’దొర’ పై తనకున్న కసిని రచయిత ఇలా తీర్చుకున్నారనిపిస్తోంది. కథనంలో మరింత పట్టు అవసరం.

జొన్నల అవసరాన్ని, ఔన్నత్యాన్ని లోకానికి తెలియజెప్పే కథ ’జొండ్ల పాతర’. ఇంటి పెద్దమనిషి రాజన్నతాత చుట్టూ తిరిగే ఈ కథను రచయిత రైతులు పత్తి నుండి తిరిగి జొన్న పంట వైపు రావడంతో ఆశాజనకంగా ముగిస్తాడు . మంగారి రమేష్ యాదవ్ తన రచనాకౌశల్యంతో చదువరులను ఆదిలాబాదులోని మారుమూల రైతు కుటుంబంలోకి తీసుకపోతాడు.

తెలంగాణకు గడీల కథలు కొత్త కాదు. చందు తులసి కలం నించి వచ్చిన మరో ’గడి’ కథ ఇందులో ఉంది. సంఘం నేతృత్వంలో గడీలపై ఆహార దాడి అనే అంశం పాతదే అయినా గడిలోని ఆడబాప పూలమ్మ, జీతగాడు ముత్యాలు పాత్రలతో కథను ఆసక్తిగా మలిచాడు రచయిత. కథలన్నీ వస్తు, క్షేత్రపరంగా తెలంగాణను ప్రతిఫలిస్తుండడంతో పాటు స్థానిక భాషతో పరిపుష్టమయ్యాయి. ఈ విషయంలో కథకులందరు సఫలమయ్యారు.

కథల ఎంపికలో ప్రచురణకు నోచుకున్న వాటినే పరిగణనలోకి తీసుకోవడంతో పత్రికలు వేయని మంచి కథల సంగతేమిటనే ప్రశ్న వస్తోంది. 2004 లో రాసిన బతుకుతాడు అనే నవలతో డిగ్రీ ప్రశ్నాపత్రంలో చోటు పొందిన గీత కార్మికుడు నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, తాను కథలు రాస్తున్నా ఎవరు వేసుకోవడం లేదంటున్నాడు. అప్పట్లో రికార్డింగ్ డ్యాన్సర్ అనే బహుమతి పొందిన ఉత్తమ కథను రాసిన వేముల సత్యనారాయణ కూడా ఇదే మాట అంటుంటాడు. లోపమెటువైపు ఉందో వెతుక్కోవాలి. ఏడాదికాలంలో వచ్చిన కథలన్నీ వీరు చదువుతున్నారా అనే డౌటును ఓ ఫీచర్స్ ఎడిటర్ వ్యక్తపరచాడు. కథల ఎంపికలో తమ విధి విధానాలను ప్రతిసారి వివరించవలసిన బాధ్యత ప్రచురణకర్తలపై ఉంది. సంపుటిలో మరిన్ని మంచి కథలు చోటుచేసుకునే దిశగా మార్పులు, చేర్పుల గురించి ఆలోచించాలి. తెలంగాణ కథ ను నిలబెట్టే ఈ కృషిలో పరిపూర్ణత అవసరం. రూబిడి కథకులకు, సంపాదకులకు అభినందనలు.

“ రూబిడి – తెలంగాణ కథ 2019, సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, డా. వెల్డంది శ్రీధర్, పేజీలు 128 , వెల : రూ.70, ప్రచురణ: సింగిడి తెరసం , ప్రతులకు 9849220321”.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News