ప్రజాస్వామ్యానికి అవకాశమే లేదు: తాలిబన్లు
కాబూల్: అఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. షరియా చట్టాల ప్రకారమే తమ పాలన ఉండనుందని స్పష్టం చేశారు. షరియా చట్టాలపై ఆధారపడి ఇస్లామిక్ ప్రభుత్వం పని చేయనుందని తాలిబన్ సీనియర్ నాయకుడు తాజాగా ప్రకటించారు. అఫ్ఘనిస్థాన్‌ను ఎలా నడిపిస్తారనే అంశంపై ఇంకా అనేక అంశాలు ఖరారు కాలేదని , గ్రూపు నాయకత్వం త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తాలిబన్ సీనియర్ నేత వహీదుల్లా హాషిమి ఒక ఇంటర్వూలో చెప్పారు. అయితే అఫ్ఘన్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన ఉండదని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థ అస్సలు ఉండదు. ఎందుకంటే దీనికి దేశంలో ఎలాంటి పునాదులు లేవు’ అని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంలీడర్ హైబదుల్లా అఖుంద్‌జాదా దేశాధినేతగా ఉంటారని హాషిమి చెప్పారు. పాలక మండలిలో సాయుధ దళాలనుండి మాజీ పైలట్లు, సైనికులు చేరవచ్చన్నారు. అయితే ప్రభుత్వ నిర్మాణంపై అంతర్జాతీయ నేతలతో చర్చిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.