Sunday, December 22, 2024

ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఆనందించదగ్గ చిత్రం

- Advertisement -
- Advertisement -

కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్‌గా రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’రూల్స్ రంజన్’. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. పాటలకు వస్తున్న అద్భుతమైన స్పందనతో ఎంతో సంతోషంగా ఉన్న నిర్మాతలు తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.

’ఇంట్రడక్షన్ ఆఫ్ రూల్స్ రంజాన్’ పేరుతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా కోసం ప్రత్యేకంగా నాలుగో పాటని ప్రదర్శించారు. గత మూడు పాటల్లాగే నాలుగో పాట కూడా కట్టిపడేసింది. అలాగే ఈ సినిమాని ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు ఏ.ఎం. రత్నం చేతుల మీదుగా విడుదల తేదీని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏఎం రత్నం మాట్లాడుతూ “సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకి అమ్రిష్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ కథని నమ్మి నిర్మించడానికి ముందు వచ్చిన నిర్మాతలు దివ్యాంగ్, మురళి అభినందనలు. ఈ సినిమా క్రెడిట్ వారికే దక్కుతుంది.

వినోదాత్మక సినిమాలకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే ఈ సినిమా చూశాను. కుటుంబమంతా కలిసి చూడగలిగేలా ఉన్న ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది”అని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “సినిమాలో నేను మనో రంజన్ అనే పాత్ర పోషించాను. మనో రంజన్ మనలో ఒకడిలా ఉంటాడు. అందరూ ఈ పాత్రకి కనెక్ట్ అవుతారు. ఇంత మంచి పాటలు ఇచ్చిన అమ్రిష్‌కి ధన్యవాదాలు. నేపథ్య సంగీతం కూడా అదే స్థాయిలో ఉంటుంది”అని తెలిపారు. దర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్లకు వెళ్లి ఆనందించదగ్గ చిత్రమిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయిక నేహా శెట్టి, నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి, సంగీత దర్శకుడు అమ్రిష్ గణేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News