చెన్నై: తమిళనాడులోని పట్టణస్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డిఎంకె హవా కొనసాగుతోంది. చెన్నై కార్పొరేషన్‌లో క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. అన్నాడిఎంకెకు కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులోను డిఎంకె జోరు కొనసాగుతోంది. కోయంబత్తూరులో 75 శాతానికి పైగా స్థానాల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం రాత్రి 8 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం రాష్ట్రంలోని కార్పొరేషన్లలో మొత్తం 1374 వార్డులకు గాను డిఎంకె 425 స్థానాల్లో జయభేరి మోగించగా, 75 చోట్ల అన్నా డిఎంకె గెలుపొందింది.
అలాగే పురపాలికల్లో 3843 వార్డు సభ్యులకుగాను డిఎంకె 1832 గెలుచుకోగా, అన్నాడిఎంకె 494 స్థానాలకు పరిమితమైంది. అలాగే 7,621 పట్టణ పంచాయతీలకుగాను డిఎంకె 4261 చోట్ల గెలుపొందగా, అన్నాడిఎంకె 1178 చోట్ల గెలుపొందింది. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 200 వార్డులకుగాను 195 వార్డుల ఫలితాలు వెలువడగా, 146 చోట్ల డిఎంకె గెలుపొందగా, అన్నాడిఎంకె 15స్థానాలకే పరిమితమైంది. మూడు వార్డుల్లో గెలుపుతో కాంగ్రెస్ మూడో స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు ఇటీవల ఎన్నికలు జరగ్గా మంగళవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
సుపరిపాలనకు సర్టిఫికెట్: స్టాలిన్
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ భారీ విజయాలను నమోదు చేయడంపై డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. తమ తొమ్మిది నెలల సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్‌గా ఈ ఫలితాలను ఆయన అభివర్ణించారు.