Sunday, December 22, 2024

రూపాయి మహా పతనం!

- Advertisement -
- Advertisement -

Rupee drops to 77.50 all time low against US Dollar

అమెరికా డాలర్‌తో రూపాయి విలువ ఇంతకుముందెన్నడూ లేనంత అథమ స్థాయికి పడిపోయింది. మే 9 మంగళవారం నాడు ఒక డాలర్ కిమ్మత్తు రూ.77.50కు సమానం అయింది. ఆ తర్వాత అదే రోజు స్వల్పంగా తేరుకున్నప్పటికీ రూ.77.23 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి అసాధారణ దిగజారుడు వల్ల మనం చేసుకునే దిగుమతులు ఖరీదవుతాయి. అదే సమయంలో ఎగుమతులపై రాబడి తగ్గుతుంది. విదేశీ చదువులు, పర్యటనలు అధిక ఖర్చుతో కూడినవిగా మారుతాయి. ద్రవ్యోల్బణం తక్షణ భవిష్యత్‌లో పేట్రేగుతుంది. ఇటువంటప్పుడు భారతీయ రిజర్వు బ్యాంకు తన వద్ద గల డాలర్ నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసి రూపాయి విలువను కాపాడడం ఆనవాయితీగా వస్తున్నది. కాని ఇటీవలి కాలంలో ఆర్‌బిఐ ఈ విషయంలో నిగ్రహం పాటిస్తున్నది. పర్యవసానంగా మరి కొద్ది రోజుల్లోనే డాలర్ విలువ మరింత పెరిగి రూపాయి ఇంకా పతనం కాగలదని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలోనే డాలర్ కిమ్మత్తు రూ.78 కావచ్చును. దేశం నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అసాధారణ స్థాయిలో తరలిపోతున్నందున రూపాయి ఈ స్థాయికి దిగజారిపోయిందని తెలుస్తున్నది. విదేశీ మదుపరులు వరుసగా ఏడో మాసం మన దేశం నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. చైనాలో పరిస్థితులు కూడా డాలర్‌తో రూపాయి మారకపు విలువ భారీ పతనానికి దోహదపడ్డాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక డాలర్ నిల్వలున్న దేశం చైనా. అవి మన స్థూల దేశీయోత్పత్తి విలువ కంటే ఎక్కువని సమాచారం.

ఇటీవల చైనాలో కొవిడ్ తిరిగి విజృంభించిన నేపథ్యంలో దాని అంతు చూడాలని అక్కడి పాలకులు నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం అనేక నగరాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. ఆ నగరాలతో ఆర్థిక సంబంధాలున్న మన దేశంలోని అనేక కంపెనీల వ్యాపారాలు కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. డాలర్‌తో రూపాయి అపూర్వ పతనానికి ఇది కూడా ఒక కారణం. అమెరికా ఫెడరల్ బ్యాంకు డాలర్ విలువను పెంచడం కూడా ఇందుకు దారి తీసిన ఈ కారణాల్లో ఒకటని బోధపడుతున్నది. దేశంలో మితిమించిపోయిన ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవడానికి రిజర్వు బ్యాంకు ఈ మధ్య వడ్డీ రేట్లను భారీగా పెంచింది. అందు వల్ల కూడా రూపాయి విలువ తరిగిపోయిందని నిపుణులు భావిస్తున్నారు. గత నెల రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరుగుతూ వుండడం మరొక కారణమని స్పష్టపడుతున్నది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మంచి చెడులు ప్రధానంగా దాని విదేశీ వాణిజ్య బలంపై ఆధారపడి వుంటుంది. ఆ మాటకొస్తే ఏ దేశ ఆర్థిక బలం పుంజుకోడం లేదా కుంగిపోడం అనేదానికి మూలంలో వుండేవి దాని విదేశీ వాణిజ్య లాభనష్టాలే. డాలరుతో ఎగుమతుల కంటే దిగుమతుల భారం ఎక్కువగా వుండే దేశాల కరెన్సీ మారకపు విలువ పరిమితంగా వుంటుంది. చైనా తన వాణిజ్య మిగులుతో అమెరికాను కూడా భయపెట్టగల ఆర్థిక బలాన్ని పుంజుకున్న సంగతి తెలిసిందే. మనం మన క్రూడాయిల్ అవసరాల్లో 80 శాతం మేరకు దిగుమతులపైనే ఆధారపడి వున్నాము. ఇది మన విదేశీ వాణిజ్యాన్ని నిరంతరం లోటులోనే వుంచుతుంది. ఎగుమతులను పెంచుకున్నప్పటికీ దిగుమతుల భారం అంతకుమించి వుండేటప్పుడు ఈ వాణిజ్యంలో అంతిమంగా లోటే తేలుతుంది. అందుచేత డాలర్‌తో మన రూపాయి పతనావస్థలో కొనసాగడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. అయితే, ఇంతకు ముందెన్నడూ లేనంతగా డాలర్‌తో మన కరెన్సీ విలువ రూ.78కు చేరుకుంటూ వుండడం ఆందోళనకరం. దేశ ఆర్థిక వ్యవస్థను అత్యంత పటిష్ఠంగా మెరుగుపరుస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఇది బోనులో నిలబెడుతున్నది. తొమ్మిదేళ్ల క్రితం 2013 ఆగస్టులో డాలర్ విలువ రూ. 64 లకు ఎగబాకినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్ర మోడీ అప్పటి యుపిఎ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందడం లేదని, రూపాయి విలువను కాపాడాలనే సదుద్దేశంతో పరిపాలన సాగించడం లేదని కేవలం అధికారంలో కొనసాగడమే లక్షంగా మనుగడ సాగిస్తున్నదని ఆయన అప్పట్లో తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత రూపాయి గొప్పలు చెప్పుకొన్న రోజులు గతంలో వున్నాయనీ ఇప్పుడైతే దాని నోరు పడిపోయిందని, అదే విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని నరేంద్ర మోడీ అప్పట్లో ఛలోక్తులు విసిరారు. ఇప్పుడు డాలరు రూ.78కి చేరువైన ఈ భారీ పతనావస్థకు తమ నిర్వాకం కారణం కాదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పగలరా?.

Rupee drops to 77.50 all time low against US Dollar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News