రూపాయి అత్యంత పతనం
డాలర్‌తో పోలిస్తచే 78.40 స్థాయికి పడిపోయిన భారతీయ కరెన్సీ
న్యూఢిల్లీ : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం చరిత్రాత్మక పతనాన్ని చవిచూసింది. ఇన్వెస్టర్ల భారీ విక్రయాల కారణంగా రూపాయి అత్యధికంగా 27 పైసలు క్షీణించింది. దీంతో రూపాయి విలువ రూ.78.40కి చేరుకుంది. కరెన్సీ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.78.38 వద్ద కనిపించింది. ఇంటర్‌బ్యాంక్ కరెన్సీ మారకం మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 78.13 వద్ద ప్రారంభమైంది. అయితే, మధ్యాహ్నానికి ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపడంతో రూ.78.40కి పడిపోయింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి డాలర్‌తో రూపాయి మారకం విలువ నిరంతరం క్షీణిస్తోంది.
అంతర్జాతీయ అస్థిరత కారణంగా విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి జీవితకాల కనిష్ట స్థాయి రూ.78.40కి పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 23న యుద్ధం ప్రారంభమయ్యే ముందు, డాలర్‌తో రూపాయి రూ. 74.62 వద్ద ఉంది. ఇది జూన్ 22న రూ. 78.40కి పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును మరింత పెంచే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటివరకు భారతీయ ఈక్విటీ మార్కెట్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
Rupee falls down to Rs 78.40 against Dollar