డాలర్‌తో పోలిస్తే 80 మార్క్ వద్ద భారతీయ కరెన్సీ
ముంబై : క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, విదేశీ పెట్టుబడులు నిరంతరం ఉపసంహరణ నేపథ్యంలో రూపాయి పతనమవుతూనే ఉంది. సోమవారం కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మరింత క్షీణించింది. రూపాయి మారకం విలువ 9 పైసలు నష్టపోయి తొలిసారిగా రూ.79.98 వద్ద ముగిసింది. అయితే ట్రేడింగ్‌లో రూపాయి తొలిసారిగా 79.99 స్థాయికి టేరింది. అంటే రూపాయి విలువ 80కి దగ్గర్లో ఉంది. ఉదయం రూపాయి రూ.79.79 వద్ద ప్రారంభమైంది. కరెన్సీ మార్కెట్ ముగిసే సమయానికి రూ.79.98 వద్ద ముగిసింది. అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు 41 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఫెడరల్ రిజర్వు నియంత్రణలో చర్యల్లో భాగంగా వడ్డీ రేట్లను ఒక శాతం పెంచవచ్చని అంచనాలు ఉన్నాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కావడానికి ఇదే కారణం. ఫిబ్రవరి 23న రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభించిన సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.62గా ఉంది. సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధామిస్తూ, డాలర్‌తో రూపాయి మారకంలో చరిత్రాత్మక పతనం జరిగిందని అంగీకరించారు. రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు పెరుగుదల, ప్రపంచ ఆర్థిక పరిస్థితి కఠినతరం వంటి కారణాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిందని మంత్రి అన్నారు. బ్రిటిష్ పౌండ్, జపనీస్ యెన్, యూరోలు డాలర్‌తో పోలిస్తే ఎక్కువగా క్షీణింటాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మెరుగ్గానే ఉందని అన్నారు.