జెనీవా: అఫ్ఘన్ పౌరులు, మహిళలు, బాలికల హక్కులకు రక్షణ కల్పిస్తామంటూ ఇచ్చిన హామీలకు తాలిబన్లు కట్టుబడి ఉండాలని ఐక్యరాజ్యసమితి(ఐరాస) కోరింది. గత ప్రభుత్వంలో పని చేసినవారికి క్షమాభిక్ష ప్రసాదిస్తామని, బాలికలు పాఠశాలలకు వెళ్లడాన్ని అనుమతిస్తామని కూడా తాలిబన్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను వారు గౌరవిస్తున్నారా..? కాలరాస్తున్నారా..? అన్నది నిశితంగా గమనిస్తామని ఐరాస మానవ హక్కుల అధికార ప్రతినిధి రూపర్ట్‌కోల్‌విల్లే తెలిపారు. మాటలకన్నా చేతల ద్వారానే వారేమిటన్నది అర్థమవుతుందని కోల్‌విల్లే అన్నారు. వారి గత చరిత్ర పట్ల అవగాహన ఉన్నవారిలో అనుమానాలు కలగడం సహజమని కోల్‌విల్లే గుర్తు చేశారు. పౌరుల భద్రత విషయంలో తాలిబన్లపై ఐరాస సభ్యదేశాలు తమ పలుకుబడిని ఉపయోగించాలని ఆయన సూచించారు. బాలికల విద్య, మహిళల స్వేచ్ఛపై తాలిబన్లు గతంలో కఠిన ఆంక్షలు అమలు చేశారన్నది గమనార్హం.