Monday, December 23, 2024

సంక్షోభంలో గ్రామీణ పాడి రైతులు!

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో ఏ దేశం కన్నా భారత దేశానికి పాడి పరిశ్రమ ప్రాణప్రదమైనది. పేద రైతులకు, భూమిలేని గ్రామీణ పేదలకు పాడి ద్వారా వచ్చే దినసరి ఆదాయం కుటుంబానికి భరోసాగా ఉంటుంది. దేశంలోని 15 కోట్ల మంది చిన్న రైతులు, పాల సహకార సంఘాలు, చిన్న చితక పాల వ్యాపారుల సమూహాలు.. వీళ్ళందరి కృషి వల్ల భారతదేశం పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి దేశంగా ఎదిగింది. ఇంతటి ప్రసిద్ధి పొందిన పాడి పరిశ్రమ నేడు సంక్షోభంలోపడి పాడి రైతులకు నష్టదాయకంగా మారటానికి కారణమేమిటి?

ఒకప్పుడు గ్రామీణ పాల వినియోగం: దాదాపు 1966 వరకు పశు పోషణ అనేది గృహ వినియోగంగా ఉండేది. వ్యవసాయ కూలీలతో సహా గ్రామీణ ప్రాంతంలో ప్రతి కుటుంబానికీ కనీసం ఒక పాడి గేద ఉండేది. పశు గ్రాస సమస్య ఉండేది కాదు. పశువుల మేత కోసం ప్రతి రైతు కొంత భూమిని కేటాయించే వారు. రెండవ పంటగా వేసిన మినుము, పెసర చేలల్లో ఓద పచ్చి గడ్డి రూపంలో విస్తారంగా లభించేది. వ్యవసాయ కూలీలు కూడా రైతుల పొలంలో పనులు చేసి వచ్చేటప్పుడు పశువులకు పచ్చి గడ్డి తీసుకు వెళ్ళేవారు. పాలు అమ్మకం సరకుగా కాక కుటుంబ ఆహార అవసరాలకు ఉపయోగించేవారు.

పెరుగు, మజ్జిగ, నెయ్యి ఆహారంలో తీసుకునేవారు. చుట్టు పక్కల వాళ్ళకు కూడా మజ్జిగ ఇచ్చేవారు. పండగల సందర్భంలో పాలు కూడా ఇచ్చేవారు. ఆ విధంగా పాడి అనేది గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చేది. పాలకుల ఆర్ధిక విధానాల ఫలితంగా కుటుంబ ఖర్చులు పెరిగి పాల ద్వారా కొంత ఆదాయం పొందేందుకు చిలికిన వెన్నను స్థానిక వ్యాపారులకు అమ్మటం ప్రారంభించారు. దాని ద్వారా వచ్చే ఆదాయం కుటుంబాలకు ఆసరాగా ఉండేది. ఈక్రమంలో కొందరు స్థానికంగా రైతాంగం నుంచి పాలను సేకరించి పట్టణ ప్రజలకు విక్రయించే వారు. ఆ విధంగా రైతాంగం పాల అమ్మకం ప్రారంభించారు. క్రమంగా గ్రామాల్లో పాల సహకార సొసైటీలు ఏర్పడ్డాయి.

బ్రిటిష్ వలస పాలనలో 1919లో మొదటిసారి పాడి పశువుల లెక్కలు జరిగాయి. 1920లో భారత దేశంలో ఆధునిక పాల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సాంకేతకలు ప్రవేశపెట్టబడ్డాయి. 1937 లో వెలువరించిన ఒక నివేదిక, దేశంలో పాల వినియోగం రేటును సూచించింది. దాని ప్రకారం 200 గ్రాముల తలసరి వినియోగంగా ఉంది. గ్రామ స్థాయి సహకార సంఘాలు (ప్రాథమిక ఉత్పత్తిదారులు) జిల్లా స్థాయి సహకార ఉత్పత్తి దారుల సంఘాలతో కూడిన మూడు-స్థాయి సంస్థాగత నిర్మాణం, మార్కెటింగ్ కోసం రాష్ట్ర స్థాయి సమాఖ్యలు. ఈ నమూన గుజరాత్ లోని ఆనంద్‌లో 1946లో ప్రారంభించబడింది. ఇది దేశవ్యాప్తంగా ఆమోదించబడింది.ఫలితంగా వ్యాపారం కోసం పాల సేకరణ ప్రారంభమైంది.

పాల సహకార సంఘాలు: అధికార మార్పిడి తర్వాత పాల రైతుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని గమనించి దేశ పాలకులు నేషనల్ డెయిరీ డెవలఫ్‌మెంట్ బోర్డు 1965లో స్థాపించబడింది. ఇది 1969- 70లో ఆపరేషన్ ప్లడ్‌ను ప్రారంభించింది. సహకార సంఘాలను ఉపయోగించి పాడి పరిశ్రమను ఆధునీకరించటం, అభివృద్ధి చేయటం లక్ష్యంగా ప్రకటించింది. అనేక రాష్ట్రాల్లో జిల్లా స్థాయి పాల డెయిరీ సహకార సంఘాలు ఏర్పడ్డాయి. గుజరాత్‌లో అమూల్, కర్ణాటకలో నందిని, కేరళలో మిల్మా, తెలంగాణలో విజయా డెయిరీ, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ డెయిరీ, కాళహస్తి కో ఆపరేటివ్ సొసైటీ వ్యవస్థీకృత డైయిరీలుగా పాలు సేకరించి విక్రయించాయి. ప్రతి జిల్లాలోనూ జిల్లా స్థాయి డైయిరీలకు లోబడి అత్యధిక గ్రామాల్లో పాల సేకరణ సొసైటీలు ఏర్పడ్డాయి. భారత దేశంలో నేడు 1,85,903 పాల సహకార సంఘాలు పని చేస్తున్నట్లు లెక్కలు తెలుపుతున్నాయి.

వీటిల్లో 32 వేల సహకార సంఘాలను మహిళలే నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఇవి కాక 210 సహకార పాల డెయిరీలు, 9 పెద్ద పాల ఉత్పత్తిదారు ల కంపెనీలు ఉన్నాయి. 2019 గణన ప్రకారం భారత దేశంలో 19,20,49 లక్షల పశువులు ఉంటే, అందులో 10,90,85 లక్షల గేదెలు ఉన్నాయి. పాల ఉత్పత్తిలో సగంపైగా గేదెల నుంచే జరుగుతున్నది. పాల ఉత్పత్తి లెక్కలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. 2020- 21 వార్షిక సంవత్సరంలో దేశం మొత్తం మీద 209.96 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరిగిందని కేంద్ర ప్రభుత్వ ఎకనమిక్ సర్వే 2021-22 తెలిపింది. భారత దేశంలో రోజు 14 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతుంటే, 50 కోట్ల లీటర్ల పాలు అమ్మతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు షేర్ అయింది.అంటే 36 కోట్ల లీటర్ల పాలు కల్తీవన్నది అర్ధమవుతుం ది.

కల్తీ పాల వల్ల ప్రమాదకర జబ్బులకు ప్రజలు లోనవుతారు. ఒకప్పుడు పాల ఉత్పతి రైతాంగం ఆధీనంలో ఉండేది. నేడు సంపన్న వర్గాల చేతుల్లోకి వెళ్ళింది. సాంప్రదాయ గేదెల, ఆవుల స్థానంలో హైబ్రీడ్ గేదెలు, ఆవులు దిగుమతి అయ్యాయి. ఒక్కో గేదె ధర రూ. 30 నుంచి రూ. 40 వేలకు పైగా ధర ఉంది. ఇంత ధర పెట్టి పేద, మధ్య తరగతి రైతులు గేదెలను కొనలేని పరిస్థితి ఏర్పడింది. అప్పు చేసి కొన్నా దాని పోషణ భారంగా మారింది. వ్యవసాయంలో వచ్చిన మార్పుల వలన వీరికి పశుగ్రాసం సమస్యగా మారింది. విదేశాల నుంచి దిగుమతి అయి జబ్బులతో గేదె చనిపోతే చేసిన అప్పు తీర్చటం రైతుకు గగనమై ఉన్న కొద్ది పాటి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి రైతులు పశు పోషణకు దూరమవుతున్నారు. సంపన్న వర్గాలు ఒక పరిశ్రమగా గేదెలు, ఆవులు కొనుగోలు చేసి వాటి కోసం షెడ్లు నిర్మించి పాల ఉత్పత్తుల ద్వారా లాభాలు గడిస్తున్నారు. దేశ పాల ఉత్పత్తిలో వీరిదే ప్రధాన భాగంగా ఉంది. ఈ విధంగా పాల ఉత్పత్తి రైతుల చేతుల నుంచి వీరి చేతుల్లోకి పోయింది. గ్రామాల్లో కూడా కొన్ని పెద్ద రైతుల కుటుంబాలు మాత్రమే గేదెల పెంపకం చేస్తున్నాయి.

గిట్టుబాటులేని పాల ధర: గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులకు పాల ద్వారా వచ్చే ఆదాయం గిట్టుబాటు కావటం లేదు. పశుగ్రాసం కొరతతో గేదెలకు ఇతర దానాలు పెట్టాల్సి వస్తున్నది. అందుకు అవసరమైన మొక్కజొన్న, జొన్న, బియ్యం ధరలు విపరీతంగా పెరగటంతో పశు పోషణ ఖర్చు బాగా పెరిగింది. అందుకు అనుగుణంగా పాల దిగుబడులు రాకపోవటం, పాల కేంద్రాల్లో వెన్న శాతాన్ని బట్టి పాలకు ధర నిర్ణయించటం వలన లీటరకు 50 రూపాయలకు మించి లభించకపోవడంతో రైతులకు దానా ఖర్చులు కూడా రావటం గగనమవుతున్నది. పశు పోషణ నష్టదాయకంగా మారింది. రంగనాథన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా పాల ద్వారా వచ్చే ఆదాయంలో రైతులకు 70%, డెయిరీల నిర్వహణకు 30% కేటాయించినప్పుడే పశు పోషణ చేయగలమని రైతులు చెబుతున్నారు.

విదేశాల నుండి దిగుమతి: పాల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించి, దేశీయ ఆదాయంలో నాలుగు శాతం భాగం పంచుకొన్న పాడి పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలో ఎందుకున్నది అనే దానికి సమాధానం పాలకుల విధానాలని వస్తది. ప్రజల అవసరాలకు సరిపడ దేశంలో పాల ఉత్పత్తులు పెంచే విధానాలు అమలు జరపకుండా, వాటిని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. అందుకోసం 2020లో మిల్క్ పౌడర్, కొన్ని పాల వస్తువులు దిగుమతికి సంబంధించి వాణిజ్య, పరిశ్రమల మంత్రత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10 వేల మెట్రిక్ టన్నుల దిగుమతికి అనుమతించింది. 2014 -15లో స్మిండ్ మిల్క్ పౌడర్ నుండి పాలను తయారు చేయటానికి అవసరమైన వెన్న కొవ్వును యూరోపియన్ యూనియన్, అమెరికాల నుంచి తక్కువ ధరకు పెద్ద ఎత్తున దిగుమతి జరిగింది. ఈ దిగుమతులు 25 వేల నుంచి 7,04,167 కిలోలు పెరిగింది. ఇదే కాలంలో భారత దేశంలోని వెన్న కొవ్వు ఎగుమతి 2014లో 20 లక్షల కిలోలు ఉండగా, 2016 నాటికి దాదాపు జీరోకు చేరింది. దిగుమతుల ఫలితంగా దేశంలో వెన్న కొవ్వు నిల్వలు అమ్ముడు కాకుండా పేరుకుపోయాయి.

అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్ దేశాలు అంతర్జాతీయ మార్కెట్లో పుష్కలంగా తక్కువ ధరకు పాలు విక్రయిస్తున్నాయి. ఈ దేశాల భాగస్వామ్యం ప్రపంచ మార్కెట్‌ను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ దేశాల రైతులకు పెద్ద ఎత్తున సహకారం అందుతున్నది. భారత పాడి రైతులకు అటువంటి సహాయం అందడం లేదు. ఫలితంగా భారత పాల ఉత్పత్తులు అమ్ముడుపోక పేరుకుపోతున్నాయి. దీనికి తోడు భారత పాల రంగంలోకి ప్రైవేట్ సంస్థల ప్రవేశంతో దేశ పాడి రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. దీనికి ప్రధాని మోడీ ప్రభుత్వం మరింత ఆజ్యం పోసేలా పాల ఉత్పత్తులపై 5 నుంచి 18% పెంచాలని నిర్ణయించడంతో వాటి ధరలు పెరిగి కొనుగోళ్ళు తగ్గనున్నాయి.

మూతపడుతున్న డెయిరీలు: పాలకుల విధానాల ఫలితంగా దేశంలో, రాష్ట్రాల్లో అనేక పాల సంఘాలు మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, హిందూపురం, రాజమండ్రి, కంకిపాడు, మదనపల్లి, పులివెందుల డెయిరీలు మూతపడ్డా యి. ఫలితంగా 60 వేల మంది పాల ఉత్పత్తిదారులు సంక్షోభంలో పడ్డారు. దేశంలోనే అతి పెద్దదైన చిత్తూరులో మూతపడిన విజయా డెయిరీని జగన్ మోహన రెడ్డి సహకార డెయిరీ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన అమూల్ డెయిరీ సంస్థకు 99 సంవత్సరాల లీజుకు కట్టబెట్టారు. పాడి రంగం సంక్షోభం నుంచి బయటపడాలంటే అధిక దిగుబడులు ఇచ్చే విధంగా పశు శాస్త్ర వేత్తలు పశువులను అభివృద్ధి చేయాలి. విదేశాల నుండి దిగుమతుల ఆపాలి. మూతపడ్డ డెయిరీలను తిరిగి ప్రభుత్వమే తెరవాలి. పాడి రైతులకు పూర్తి సహకారం అందించాలి. పాలకు న్యాయమైన ధర ఇవ్వాలి. దానా ధరలను తగ్గించాలి. పశుగ్రాస కొరత నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకోసం యావన్మందీ పాల ఉత్పత్తి దారులు ఉద్యమించాలి.

బొల్లిముంత సాంబశివరావు- 9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News