Saturday, November 23, 2024

కులవృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: తలసాని

- Advertisement -
- Advertisement -

కులవృత్తులకు చేయూత అందించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష్యం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

కరీంనగర్: ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తుల ను నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన గొల్ల, కురుమ ముఖ్య నేతలు, మత్స్యకారుల సమావేశంలో మంత్రి  మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కులవృత్తులపై ఆధారపడిన వారి జీవితాలలో వెలుగులు నింపాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కులవృత్తుల పై ఆధారపడ్డ వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచన తో 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొల్ల, కుర్మలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గ్రామీణ కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆయన తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తుందని అన్నారు. 74 సంవత్సరాల లో జరగని అభివృద్ధి 7 సంవత్సరాల లో జరిగిందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిస్తే.. ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల ను విమర్శించడం అలవాటుగా పెట్టుకున్నారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినవేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తాను చేశానని ఈటెల రాజేందర్ చెప్పుకుంటున్నా.. ఆ పనులు అన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ప్రభుత్వ నిధులతో చేపట్టిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఈటెల రాజేందర్ కు ఎంతో గౌరవం, గుర్తింపు ఇచ్చిందని అన్నారు. తన తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మీరేం చేస్తారో… చేశారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. రెండున్నర సంవత్సరాల క్రితం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు ఏం చేశారో, కేంద్రం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కు ప్రజలు అండగా ఉన్నారని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ గెలుపుతో నే హుజూరాబాద్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్  రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ ముదిరాజ్, ఎంఎల్ సి ఎగ్గే మల్లేశం, ఎంఎల్ఎలు జైపాల్ యాదవ్, నోముల భగత్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News