Saturday, December 21, 2024

నిర్వీర్యమవుతున్న గ్రామీణ ఉపాధి హామీ

- Advertisement -
- Advertisement -

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమై 18 సంవత్సరాలు పూర్తి అయినా, గ్రామీణ పేదలకు పథకంలో పేర్కొన్న విధంగా పనులు కల్పించడంలో విఫలమైంది. గ్రామీణ పేదలకు సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాల్సిన ఈ పథకం దినదిన గండం మారింది. 2005 ఆగస్టు 23న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని నార్సల మండలం బండమీదపల్లి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2 ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 742 జిల్లాలు, 7,204 మండలాలు, 2,69,121 గ్రామ పంచాయతీల్లో ఈ పథకం అమల్లో ఉంది. ఆర్భాటంగా ప్రారంభించిన ఈ పథకం నిర్వీర్యమవుతున్నది.

తగ్గుతూ ఉన్న బడ్జెట్ కేటాయింపులు

2020-21లో రూ. లక్షా 9 వేల కోట్లు కేటాయిస్తే, 2022- 2023లో రూ. 73 వేల కోట్లకు నిధుల కేటాయింపు తగ్గింది. 2024 -25 బడ్జెట్‌లో 60 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. 2021లో వేతన కూలీ 255 రూపాయలు ఉంటే, నేడు 305 రూపాయలుగా ఉంది. పెరిగిన వేతనం ప్రకారం తాజా బడ్జెట్‌లో రూ. లక్షా 30 వేల కోట్లు కేటాయించాలి. ఉపాధి కోల్పోయిన కుటుంబాలు. బడ్జెట్ కేటాయింపులు తగ్గటంతో ఉపాధి పని దినాలు కూడా తగ్గాయి. 2020- 21లో ఉపాధి పథకం కింద పని చేసే కుటుంబాలు 7 కోట్ల 55 లక్షల ఉంటే, 2023లో 4 కోట్ల 68 లక్షలకు తగ్గింది. అంటే 2 కోట్ల 87 లక్షల కుటుంబాలు ఉపాధి పనులకు దూరమయ్యారు. 2020- 21లో సగటు కుటుంబానికి 52 రోజులు పని కల్పిస్తే, నేడు 47 రోజులకు పడిపోయింది. వంద రోజులు పని చేసిన కుటుంబాలు 71,97,090 ఉంటే నేడు 44,97,113 గా ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా ఒక్క పని దినం కూడా నమోదు కాని పంచాయితీలు 13,467 ఉన్నాయంటే ఉపాధి హామీ పథకం అమలు ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. ఉపాధి హామీ పథకం పనులకు ఇచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది. వేతనాల పెంపుదల నామమాత్రమే. గత సంవత్సరంతో పోలిస్తే గోవాలో 10.56,% కర్ణాటకలో 10.40% వేతనం పెరగగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో 3% మాత్రమే పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 10.29% పెరుగుదల ఉంది. 2923-24లో సగటు దినసరి వేతనం 261 రూపాయలు. నేడు పెంచిన కూలితో 289 రూపాయలుగా ఉంది. వ్యవసాయ పనులకు 4నుండి 5 వందల రూపాయల దాకా రోజు కూలీ ఉంది. దీన్ని గమనిస్తే ఉపాధి కూలీలు ఎలా దోపిడీకి గురవుతున్నది అర్ధమవుతున్నది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పోలిస్తే, ఉపాధి కూలీలకు పెరిగిన వేతనం నామమాత్రమే. ఉపాధి పనులకు లభించే కూలీ, కూలీల కుటుంబ పోషణకు సరిపోక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు

ఉపాధి హామీ పథకం గురించి నియమించిన పార్లమెంటరీ స్థాయి కమిటీ, వ్యవసాయ కూలీల వేతనాలకు దీటుగా ఉపాధి కూలీల వేతనాలు ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. అలాగే పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనం ఇవ్వాలని చెప్పింది. వ్యవసాయ కూలీల కనీస వేతనం 375 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఉపాధి పథకం వేతనాల్లో రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసాన్ని పార్లమెంటరీ ప్యానల్ ఆక్షేపించింది. దేశ వ్యాప్తంగా ఉపాధి వేతనాలు ఒకే విధంగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉపాధి వేతనాలు 204 నుండి 318 రూపాయల మధ్య ఉన్నాయని తెలిపింది.

కూలీలకు వేతన బకాయిలు

తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురికావటమే కాకుండా, ఆ వేతనాన్ని కూడా కూలీలు పొందలేకపోతున్నారు. కూలీలకు ఇవ్వాల్సిన వేల కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బకాయిలు పెడుతున్నాయి. 2023 జనవరి నాటికి కేంద్ర ప్రభుత్వం కూలీలకు 13 వేల కోట్ల రూపాయలు బకాయిపడిందని పార్లమెంటరీ ప్యానల్ తెలియచేసింది. 2024 ఏప్రిల్ నాటికి రూ. 20,751 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని బకాయిలపై ప్యానల్ ప్రశ్నలు వేసింది. కూలీల వేతనాలు పెంచటానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని గ్రామీణాభివృద్ది శాఖ (డిఒఆర్‌డి)ని కోరింది.ఎపిలో మూడు నెలలుగా వేతనాలు ఇవ్వని ఫలితంగా కూలీలకు 2,300 కోట్ల రూపాయల బకాయిలు ఉండగా, తెలంగాణలో రూ. 200 కోట్లు కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన ప్రజాప్రయోజనాల వాజ్యంపై న్యాయస్థానం స్పందిస్తూ ‘తీరుబడిగా వేతనాలు ఇస్తామంటే ఎలా కుదురుతుంది? కరువుసాయం చేయడమంటే ఏదో ముష్టి వేస్తున్నామన్న భావన, ఉండటం మంచి పద్ధతి కాదు’ అని వ్యాఖ్యానించింది.

అవినీతి- అవకతవకలు

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతికి నిలయంగా మారింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల జేబులు నిండుతున్నాయి. కూలీల హాజరులో మోసాలు, కూలీలకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకుని వడ్డీలకు ఇస్తున్న అధికారులు, కూలీల వేతనం తగ్గించి ఇవ్వటం, పనులు చేయకుండా, చేసినట్లు రికార్డులు సృష్టించటం వల్ల ఉపాధి పనుల్లో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి పథకం నిధులను వేరే వాటికి మళ్లించటం వల్ల కూడా అనేక అవకతవకలకు కారణంగా ఉంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి, అవకతవకల గురించిన అనేక మోసాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

ఎవరైనా ఉపాధి పనుల అవినీతి మోసాన్ని బహిర్గతం చేస్తే వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. జార్ఖండ్‌లో ఉపాధి పథకం లో మోసాన్ని చూపించిన ఒక కార్యకర్త హత్య చేయబడ్డాడు. ఎన్‌జిఒలు నిర్వహిస్తున్న సామాజిక తనిఖీలపై అధికారుల బృందం రాజస్థాన్‌లో కేసులు వేశారు. తనిఖీలకు వ్యతిరేకంగా శక్తివంతమైన లాబీ ముఠాలు ఉన్నాయి. మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెడుతూ, కూలీలకు వేల కోట్ల వేతన బకాయిలు పెండింగ్ పెడుతూ, సకాలంలో వేతనాలు చెల్లించకుండా పథకాన్ని నిర్వీర్యం చేసి అటకెక్కించ చూస్తున్నది. అందుకు ఉపాధి హామీ పథకం భారంగా మారిందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నది. అసలు సంక్షేమ పథకాలే దేశానికి మంచిది కాదు అంటున్నది. పేదలకు కొంత మేర ఉపయోగపడే సంక్షేమ పథకాలు ఆర్థిక భారమంటున్న మోడీ ప్రభుత్వం, బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు చెల్లించాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను పారు బకాయిల పేరుతో ఎందుకు రద్దు చేస్తున్నది? ప్రభుత్వానికి భారం బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన అప్పులే కాని, సంక్షేమ పథకాలు కాదు. జనాభాలో 70 శాతం ప్రజలు, శ్రామిక శక్తి గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వ్యవసాయమే నేటికీ దేశానికి కీలకంగా ఉంది.

పాలకుల విధానాల వల్ల ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లిన శ్రామికులు కోవిడ్ కాలంలో ఉపాధిని కోల్పోయి తిరిగి గ్రామాలకు వచ్చారు. వారిని గ్రామాలు ఆదరించాయి. వారికి పని కావాలి. అందుకు వ్యవసాయ పనులతో పాటు అదనంగా గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పించినప్పుడే వారికి ఉపాధి లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అదనంగా పనులు కల్పించకపోగా ఉన్న పనులను కూడా తగ్గించటంతో గ్రామీణ ప్రజలకు ఉపాధి లేమి తీవ్రమై, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. కుటుంబ పోషణ భారంగా మారింది. గ్రామీణ పేదల ఉపాధి లేమికి, వలసలకు, సేద్యపు భూమికి విడదీయరాని సంబంధం ఉంది. సేద్యపు భూమి కొద్ది మంది భూ కామందుల చేతుల్లో బందీగా ఉంది. వారి బంధనాల నుండి భూమిని విముక్తి చేసి పేదలకు భూ పంపిణీ జరిగినప్పుడే ఉపాధి సమస్య పరిష్కారంతో పాటు వలసల నివారణ జరుగుతుంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం భూములు పంచదు. ప్రజలే పోరాడి సాధించుకోవాలి. అందుకోసం పోరాడుతూనే, గ్రామీణ ఉపాధి హామీ పనులు 200 రోజులకు పెంచాలని, రోజు కూలీ 500 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News