Friday, December 20, 2024

పల్లెల్లో వైద్యం పడకేస్తోంది!

- Advertisement -
- Advertisement -

ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామంటూ పాలకులు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా ఆచరణలో మాత్రం పల్లెలకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయన్నది నిర్వివాదాంశం. గ్రామీణులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ఏ ప్రభుత్వానిదైనా కప్పదాటు వైఖరే. పట్టణ ప్రాంతాలతో పోల్చి చూస్తే పల్లెలకు అందే వైద్య సేవలు నామమాత్రమనే చెప్పుకోవాలి. సేవల మాట అటుంచి వైద్య సౌకర్యాల కల్పన కూడా తీసికట్టుగానే ఉండటం ఆందోళనకరం. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక కుండబద్దలు కొడుతోంది. పల్లె జనానికి సుస్తీ చేస్తే తక్షణ వైద్య సేవలు అందించేవి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలే. జ్వరం వచ్చినా, పక్షవాతం, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ వంటి వాటికి ఈ కేంద్రాల్లో చికిత్స చేసి, ఉచితంగా మందులు అందిస్తారు. ఈ విషయంలో ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే ఎఎన్‌ఎంలు, హెల్త్ వర్కర్లది కీలక పాత్ర.

అయితే తెలంగాణలో 20 శాతం ఎఎన్‌ఎం, 70 శాతం పురుష హెల్త్ వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక బట్టబయలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,229 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండగా, కేవలం 1,939 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. అన్ని భవనాలకూ నీరు, కరెంటు సౌకర్యాలు ఉన్నాయన్న సంగతి ఊరట కలిగించేదే గానీ పురుషులు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్డి సౌకర్యం ఒక్క భవనంలోనూ లేదన్న వాస్తవం కలవరం కలిగించకమానదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్ అవసరం. ప్రత్యామ్నాయ వైద్య విధానాలైన హోమియోపతి, ఆయుర్వేదం వంటి వాటిని పక్కనబెడితే, భారత దేశంలో ఏటా 90వేల మంది అల్లోపతి వైద్య విద్యార్థులు ఎంబిబిఎస్ పట్టా తీసుకుంటున్నారు.

కోటీ నలభై లక్షల జనాభా అవసరాలను తీర్చాలంటే 14 లక్షల మంది డాక్టర్లు అవసరం. ఇలా చూస్తే ఈ నిష్పత్తి నిర్దేశిత బెంచ్ మార్క్‌కు దగ్గరలోనే ఉన్నట్లు అనిపించినా, విదేశాలకు వలస పోతున్న, పదవీ విరమణ చేస్తున్న డాక్టర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే సమస్య ఇప్పట్లో తీరేటట్లు లేదన్న వాస్తవం కళ్లకు కడుతుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలను బట్టి ఇంకా ఆరు లక్షల డాక్టర్ల కొరత ఉన్నట్లు విశదమవుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక పిజి చేసేందుకు విదేశాల వైపు చూస్తున్న మెడికోల సంఖ్య ఏ ఏటికాయేడాది పెరుగుతూనే ఉంది. అనేకులు అమెరికా, ఇంగ్లండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లి పిజి చేసి, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. ప్రభుత్వాలు ప్రజారోగ్య రంగంలో లక్ష్యాలను ఘనంగా నిర్దేశించుకుంటున్నా కేటాయింపులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటున్నాయి. ఇతర దేశాలతో పోల్చి చూసుకుంటే మన దేశం వైద్య రంగంపై చేస్తున్న ఖర్చు దిగదుడుపే. ప్రపంచ దేశాల సగటు ఖర్చు జిడిపిలో 5.8 శాతం ఉంటే భారత దేశం ఒక్క శాతం మాత్రమే ఖర్చు చేస్తోంది.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వైద్యులు ఖచ్చితంగా గ్రామా ల్లో పని చేయాలన్న నిబంధన పకడ్బందీగా అమలు కాకపోవడం.. గ్రామీణ వైద్యం కుంటుపడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి. వైద్యుల కొరత ఎంత తీవ్రంగా ఉందో కరోనా మహమ్మారి పెచ్చరిల్లినప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిటలాడిపోతే, వారికి సేవలందించేందుకు ఆస్పత్రులలో ఉన్న అరకొర సిబ్బంది ఎంత నరకయాతన పడ్డారో తెలిసిందే. కొందరు డాక్టర్లు రోజుల తరబడి ఆస్పత్రులకే అంకితమై, ఇంటి మొహం కూడా చూడలేదంటే అతిశయోక్తి కాదు. జనాభాలో మూడింట రెండొంతుల మంది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటే, డాక్టర్లలో మూడింట రెండొంతుల మంది పట్టణ, నగర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ఈ పరిస్థితి గమనించి, మొబైల్ క్లినిక్కులు, టెలీ మెడిసిన్ వంటి విధానాలను ప్రవేశపెట్టినా వాటి వల్ల ప్రయోజనాలు అంతంత మాత్రమే. గ్రామీణులకు ప్రాథమిక వైద్యమే కరువైనప్పుడు, ఎమర్జెన్సీ సమయాల్లో నాణ్యమైన వైద్యం అందుతుందనుకోవడం భ్రమ.

ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలను తీసుకుంటే కొంత వరకూ ప్రాథమిక వైద్యానికైనా పల్లె జనం నోచుకుంటారు. అదే సమయంలో, డిగ్రీ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో కొంత కాలం పాటు సేవలందించేలా పటుతరమైన చర్యలు తీసుకోవాలి. మండల కేంద్రాల్లోనైనా అధునాతన సౌకర్యాలతో కూడిన ఆస్పత్రుల నిర్మాణం, సిబ్బంది నియామకం తప్పనిసరి. లేదంటే, ప్రగతికి పట్టుగొమ్మలయిన పల్లెల్లో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలేనని చెప్పకతప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News