హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన రహదారి పనులను నాణ్యతతో చేయాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచించారు. గురువారం కరీంనగర్ కార్యాలయంలో పార్లమెంటు పరిధిలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.116 కోట్ల నిధులతో చేపట్టిన గ్రామీణ రహదారుల పనుల పురోగతిపై ఎంపి బండి సంజయ్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ ఎస్.ఈ సుదర్శన్ రావు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ రహదారుల నిర్మాణాల విషయంలో నాణ్యత లోపించకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి పార్లమెంట్ పరిధిలోని ఆయా గ్రామాల్లో పనులు త్వరితగతిన పూర్తి అయ్యేటట్లు చూడాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో గ్రామీణ రహదారులు, వంతెనల అభివృద్ధి కోసం 116 కోట్ల నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేసిందని తెలిపారు. ఆయా ప్రాంతాలలో 180 కిలోమీటర్ల మార్గాల ప్రగతి కోసం 97.20 కోట్లు, వంతెనల కోసం 18.70 కోట్ల నిధులు మంజూరు అయినందున పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను కోరారు. పార్లమెంట్ పరిధిలోని ఆయా ప్రాంతాలలో గ్రామీణ రహదారుల నిర్మాణంతో గ్రామ రూపురేఖలు మారనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామీణ రహదారుల నిర్మాణం నాణ్యతతో చేపట్టాలి: బండి
- Advertisement -
- Advertisement -
- Advertisement -