బెంగళూరు: వైద్య విద్యార్థులకు కర్నాటక ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వైద్య విద్యార్థులు ఇక తప్పనిసరిగా ఏడాదిపాటు గ్రామీణ సర్వీసు చేయవలసిన అవసరం లేదు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్సును త్వరలో విడుదల చేయాలని గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఎంబిబిఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ గ్రాడ్యుయుట్ల అందరూ తప్పనిసరిగా ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యకేంద్రాలలో పనిచేయవలసి ఉంటోంది. ఈ ఆర్డినెన్సు జారీ అయిన తర్వాత వైద్య విద్యార్థులు ఇక తప్పనిసరిగా రూరల్ సర్వీసును చేయవలసిన అవసరం ఉండదని న్యాయ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కె పాటిల్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న ఖాళీ పోస్టుల మేరకే రూరల్ సర్వీసును పరిమితం చేస్తామని ఆయన చెప్పారు.
ప్రబుత్వ ఆసుపత్రులలో ఉన్న ఉద్యోగాల కంటే రూరల్ సర్వీసు అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ఖజానాపై భారం తగ్గిపోతుందని ఆయన చెప్పారు.
కంపల్సరీ రూరల్ సర్వీసు కింద ఎంబిబిఎస్ విద్యార్థులకు నెలకు రూ.62,666 జీతాన్ని, ఎండి లేదా ఎంఎస్ విద్యార్థులకు నెలకు రూ.70,000, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు నెలకు రూ. 72,800 జీతాన్ని చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కంపల్సరీ రూరల్ సర్వీసు తీసుకోని విద్యార్థులకు ప్రభుత్వం రూ. 15 నుంచి 30 లక్షల జరిమానా విధిస్తోంది.
2023-24 విద్యా సంవత్సరంలో గ్రామీణ సర్వీసు కోసం 6,766 మంది ఎంబిబిఎస్, పిజి వైద్య విద్యార్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వీరి వల్ల ఖజాబాపై దాదాపు రూ.290.4 కోట్ల భారం పడుతుంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో మొత్తం 3,251 మంది ఎంబిబిఎస్ విద్యార్థులు గ్రామీణ సర్వీసు కోసం రిజిస్టర్ చేసుకోగా ఖాళీలు మాత్రం 1,897 మాత్రమే ఉన్నాయి. వీరిని భర్తీ చేసుకోవాలంటే ప్రబుత్వం అదనంగా 1,354 పోస్టులను సృష్టించాల్సి ఉంటుంది. దీని వల్ల రూ.101.82 కోట్ల భారం పడుతుంది.
వీరు గాక 2023-24 విద్యా సంవత్సరంలో 3,515 మంది పిజి విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా ఉన్న పోస్టులు మాత్రం 1,270. వీరి కోసం మరో 2,245 పోస్టులను సృష్టించాల్సి ఉంటుంది. అదనపు భారం రూ.188.58 కోట్లు ఉంటుంది.
ఇర పేం,ఇ మునిటఖ ప్రాతిపదికపైనే గ్రామీణ సర్వీసుల కోసం నియామకం జరుగుతుందని పాటిల్ చెప్పారు. వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఖాళీలన్నిటినీ భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.