Sunday, January 19, 2025

పోరాడుతున్న ఇంగ్లండ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్‌ ఇంగ్లండ్ జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. తొలి రెండు రోజులు టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించగా శనివారం మూడో రోజు ఆటలో మాత్రం ఇంగ్లండ్ పైచేయి సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లండ్ అసాధారణ బ్యాటింగ్ ఈ ఆధిక్యాన్ని సునాయాసంగా దాటేసింది. ఓలి పోప్ అజేయ శతకం సాధించడంతో ఇంగ్లండ్ ఇప్పటి వరకు 126 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. రానురాను పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారుతున్న పరిస్థితుల్లో ఆదివారం ఇంగ్లండ్ మరో వంద పరుగులు సాధిస్తే టీమిండియాకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. 421/7 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ప్రత్యర్థి బౌలర్లు సఫలమయ్యారు. మరో 15 పరుగులు జోడించి భారత్ మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. జడేజా (87), అక్షర్ పటేల్ (44) పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ నాలుగు, హార్ట్‌లీ, రెహాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

శుభారంభం..
తర్వాత భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. క్రాలీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. అయితే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేసి క్రాలీని అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో 45 పరుగులు తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఓలి పోప్ ఒంటరి పోరాటం..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఓలి పోప్ తనపై వేసుకున్నాడు. అతనికి డకెట్ అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన డకెట్ ఏడు ఫోర్లతో 47 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే జో రూట్ (2) కూడా ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా బుమ్రాకే దక్కింది. కొద్ది సేపటికే జానీ బెయిర్‌స్టో (10), కెప్టెన్ బెన్ స్టోక్స్ (6) కూడా పెవిలియన్ చేరారు. దీంతో ఇంగ్లండ్ 163 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో చిక్కుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా పోప్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. అతనికి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ అద్భుత సహకారం అందించాడు.

ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్య జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అయితే 81 బంతుల్లో 2 ఫోర్లతో 34 పరుగులు చేసిన బెన్ ఫోక్స్‌ను అక్షర్ పటేల్ వెనక్కి పంపాడు. దీంతో 112 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఫోక్స్ ఔటైనా పోప్ జోరును కొనసాగించాడు. అతనికి రెహాన్ అహ్మద్ 16 (నాటౌట్) అండగా నిలిచాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన పోస్ 208 బంతుల్లో 17 ఫోర్లతో 148 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు 316 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News