కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యాదాడులు ఆగడం లేదు. దక్షిణ జపోరిజ్జియా ప్రాంతం లోని విల్నియన్స్ లోని ఆస్పత్రి భవనంపై రాత్రికి రాత్రి రష్యా రాకెట్ల దాడితో నవజాత శిశువుతోపాటు పలువురు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఆస్పత్రి భవనం లోని రెండు అంతస్తుల్లో ఉన్న ప్రసూతి వార్డు ధ్వంసమైందని పేర్కొన్నారు. శిధిలాల కింద నవజాత శిశువుతోపాటు ఓ మహిల, డాక్టర్ చిక్కుకున్నట్టు వివరించారు. మహిళ, డాక్టర్‌ను రక్షించగా, శిశువుని కాపాడుకోలేక పోయినట్టు తెలిపారు.
బుధవారం ఈశాన్య ఖార్కివ్ ప్రాంతంలో తొమ్మిది అంతస్తుల భవనంపై జరిగిన దాడిలో ఇద్దరు మరణించారని స్థానిక గవర్నర ఒలేగ్ సైనెగుబోవ్ తెలిపారు. ఉక్రెయిన్ లోని ఆస్పత్రులపై గతంలో కూడా దాడులు జరిగాయి. రష్యా ఆక్రమించుకున్న మరియుపోల్‌తోసహా అనేక ప్రాంతాల్లో ఆస్పత్రులపై దాడులు జరిగాయి. రష్యా యుద్ధ ప్రారంభమైన నాటి నుంచని ఉక్రెయిన్ కేంద్రాలపై 700 కంటే ఎక్కువ దాడులు జరిగాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల పేర్కొంది.