Wednesday, January 22, 2025

75 క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడ్డ రష్యా

- Advertisement -
- Advertisement -

Russia attacked Ukraine cities with 75 missiles

8 మంది మృతి, 24 మందికి గాయాలు
కీవ్ నగరం లోని బ్రిడ్జ్‌పై దాడి
సెక్యూరిటీ సర్వీస్ కార్యాలయం ధ్వంసం
షెవ్‌చెంకో పార్కుపై బాంబుల వర్షం
41 క్షిపణులను అడ్డుకున్నట్టు ఉక్రెయిన్ వెల్లడి

కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై సోమవారం రష్యా దాడులు మొదలు పెట్టింది. ఉదయం కీవ్ నగరం పేలుళ్లతో దద్దరిల్లింది. జూన్ 26 తరువాత ఉక్రెయిన్ రాజధానిపై రష్యా దాడి చేయడం ఇదే తొలిసారి. 75 క్షిపణులతో దాడి చేసినట్టు సమాచారం. కెర్చ్ వంతెన పేల్చివేయడంలో ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ విభాగం హస్తం ఉందని పుతిన్ ఆరోపించిన తరువాత ఈ దాడులు మొదలు కావడం గమనార్హం. అయితే ఈ 75 క్షిపణుల్లో 41 క్షిపణులను అడ్డుకున్నట్టు ఉక్రెయిన్ సైనిక దళాల కమాండర్ ఇన్ చీఫ్ పలేరీ జాలుజిని తెలిపారు. నగరం లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్టు మేయర్ విటాలి ఓ టెలిగ్రామ్ ఛానల్‌లో పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం సమీపంలో కూడా దాడి జరిగినట్టు ఆ దేశ ఇంటీరియర్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు తొలిసారి పేలుడు సంభవించింది. కీవ్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రసిద్ధ బ్రిడ్జ్ ఆఫ్ గ్లాస్‌పై దారుణంగా బాంబు దాడిజరగడంతో వంతెన బూడిదతో కప్పబడినట్టుగా నిర్మానుష్యంగా మారింది. అలాగే ఎప్పుడూ జనాలతో అత్యంత రద్దీగా ఉండే షెవ్‌చెంకో పార్కుపై కూడా దాడులు జరిగాయి.

కీవ్ లోని సెక్యూర్టీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ (ఎస్బీయు) ప్రధాన కార్యాలయం దాడిలో ధ్వంసమైంది. దాడుల నేపథ్యంలో మెట్రో సర్వీసులను ఆపేశారు. స్టేషన్లను ఆశ్రయ కేంద్రాలుగా వాడుతున్నారు. కీవ్‌లో ఇటీవల కొత్తగా నిర్మించిన పాదచారుల, సైక్లింగ్ బ్రిడ్జిని కూడా పేల్చేశారు. దేశ వ్యాప్తంగా కీవ్‌తోపాటు జైటోమిర్, ఖెల్నిట్సీ, డెనిప్రో, ల్వీవ్, టెర్నోపిల్ నగరాలపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 8 మంది మరణించగా, మరో 24 మంది గాయపడినట్టు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. క్షిపణి దాడులు, ఉక్రెయిన్ ధైర్యాన్ని దెబ్బతీయలేవని ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజినికోవ్ వెల్లడించారు. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ,.. “మా దేశాన్ని భూమిపై నుంచి తుడిచి పెట్టాలని రష్యా భావిస్తోంది. జపొరిజియాలో ఇళ్లల్లో నిద్రిస్తున్న మా ప్రజలను అంతమొందించింది. డెనిప్రో, కీవ్‌లకు పనులకు వెళ్లే వారిని చంపింది. ఉక్రెయిన్ మొత్తం వైమానిక దాడుల సైరన్లు మోగుతున్నాయి.

క్షిపణి దాడులు జరుగుతున్నాయి. దురదృష్ట వశాత్తు కొందరు మరణించగా, మరి కొందరు గాయపడ్డారు” అని వెల్లడించారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కెర్చ్ వంతెనపై దాడిని తీవ్రంగా పరిగణించారు. ఆయన రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌తో కూడా భేటీ కానున్నారు. గత ఏప్రిల్‌లో కీవ్ సరిహద్దుల నుంచి రష్యా దళాలను ఉపసంహరించుకోవడంతో ఇప్పటికే అవి ఉక్రెయిన్ సైనికుల అధీనంలో ఉన్నాయి. దీంతో ఇప్పుడు రష్యా ఈ నగరంపై గురి పెట్టింది. మరోవైపు రష్యా దళాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని యూకే రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈశాన్య, దక్షిణ భాగాల్లో వాటి పరిస్థితి బాగోలేదని పేర్కొంది. ఉక్రెయిన్ లోని జపోరిజియా ప్రాంతంలో ఆదివారం రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో 13 మంది మరణించారు. ఈ దాడిని అత్యంత క్రూరమైన దాడిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News